సినీ నటుడు, అలనాటి హీరో సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మరో రెండుసార్లు జగన్ సీఎంగా కొనసాగితే రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడ జవహర్‌నగర్‌లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని తెలిపారు. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా ఒకే వ్యక్తికి అవకాశం ఇస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నవరత్నాలతో పేదల్లో చిరునవ్వును నింపిందని సుమన్ అన్నారు.
మరోవైపు సినిమా పరిశ్రమ బాగుండాలని వైసీపీ ప్రభుత్వం సాధ్యమైనంత ఎక్కువే చేసిందని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తామంతా కట్టుబడి ఉంటామన్నారు. బయ్యర్లు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పారు. ఏపీలో మంచి షూటింగ్ స్పాట్లు ఉన్నాయని.. ఏపీలో స్టూడియోలు స్థాపించేలా సినీ ప్రముఖులు కృషి చేయాలని సూచించారు. సినిమాల్లోకి వెళ్లాలని ఓ మెకానిక్ సలహా ఇస్తేనే తాను ఈ రంగానికి వచ్చానని తెలిపారు. అందుకే తనకు మెకానిక్‌లంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు.