కోవిడ్ అనంతరం కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఈ నెల 11వ తేది నుంచి 17వ తేది వరకు భారీసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. 7 రోజులలో 5.30 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 24.38 లక్షల లడ్డూలు విక్రయిస్తే….హుండీ ద్వారా రూ.32.5 కోట్లు ఆదాయం లభించిందన్నారు.
46 వేల 419 వాహనాలలో భక్తులు తిరుమలకు తరలివచ్చారన్నారు. మే 1వ తేది నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను తిరుమలకు అనుమతిస్తాం అన్నారు. గత ఏడాది వర్షాల కారణంగా శ్రీవారిమెట్టు మార్గం ధ్వంసం అయింది. ఈ మార్గంలో మరమ్మతుపనులు చేపడుతోంది టీటీడీ. వీఐపీ బ్రేక్ దర్శనాలను ఇవాళ నుంచి పునరుద్ధరిస్తున్నాం అన్నారు ధర్మారెడ్డి. మరోవైపు స్లాట్ దర్శనాలు తిరిగి ప్రారంభించే యోచనలో టీటీడీ వున్నట్టు తెలుస్తోంది.
Also Read: Strike: పెట్రో ధరలపై ఆగ్రహం.. రెండు రోజులు ఆటోలు, టాక్సీలు బంద్..
గత కొంతకాలంగా స్లాట్ దర్శనాలు లేవు. దీంతో భక్తులు వీటి కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతి నిత్యం 20 వేల మంది వరకు సర్వదర్శన టోకెన్లు జారీచేయాలని నిర్ణయం తీసుకోనుంది. దర్శన టోకెన్లు లేని భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతించాలని భావిస్తోంది టీటీడీ. ఈ నిర్ణయం కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి వుండే భక్తులకు దర్శన సమయం పెరగనుంది.