పెట్రో ధరల పెరుగుదల వెనుక ఎలాంటి కారణాలు ఉన్నా.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఆ ధరల జోలికి పోలేదు.. ఇక, ఫలితాలు వెలువడిన తర్వాత కాస్త గ్యాస్ తీసుకుని వరుసగా వడ్డించింది.. దీంతో.. పెట్రోల్ ధరలు ఆల్‌టైం హై రికార్డును సృష్టించాయి. దీంతో, ఢిల్లీలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఇవాళ, రేపు బంద్ పాటిస్తున్నారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఈ రెండు రోజుల ఆందోళన చేపట్టారు. పెట్రో ధరలను తగ్గించడంతో పాటు తమ కిరాయి పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దేశం కరోనా కష్టకాలం మొదలయ్యాక పెట్రో ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజారవాణా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. అయితే, ఆటో, ట్యాకీ డ్రైవర్లకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది.
Read Also: Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా ఢిల్లీలోని ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల సంఘాల సభ్యులు సోమవారం నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని నిర్ణయించారు. ఛార్జీలు పెంచాలని, ఇంధన ధరలు తగ్గించాలని పలు ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరిస్తామని ఢిల్లీ ప్రభుత్వం హామీ ఇచ్చినా సమ్మె విరమించలేదు. సమయానుకూలంగా ఛార్జీల సవరణను పరిశీలించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ మజ్దూర్ సంఘ్‌కు చెందిన ఆటో అండ్ ట్యాక్సీ అసోసియేషన్ ఆఫ్ ఢిల్లీ ఏప్రిల్ 18 మరియు 19 తేదీలలో ఢిల్లీలో సమ్మెను ప్రకటించింది. ఈ రెండు రోజులలో పెద్ద సంఖ్యలో ఆటోలు మరియు క్యాబ్‌లు ఢిల్లీ వీధుల్లోకి రావని వారు పేర్కొన్నారు.