వాతావరణం మారిపోయింది. ఏపీలో మరో మూడురోజులు ముసురే. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర,రాయలసీమల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తాలో భారీ వర్షాలకు ఆస్కారం వుందంటోంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ప్రస్తుతం ఉత్తర–దక్షిణ ద్రోణి ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక పరిసరాల వరకు ఆంధ్రప్రదేశ్ మీదుగా పయనిస్తోంది. ఇది సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే రెండ్రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో దీని ప్రభావం మరింత ఎక్కువ ఉండడంతో అక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బుధవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఈనెల 9న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నాయి. ఇటు ద్రోణి, అటు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో బుధవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం నివేదికలో తెలిపింది.
Read Also: Diesel Shortage: చెన్నై నగరంలో డిజిల్ కొరత.. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు
ఉత్తరకోస్తాలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, దక్షిణ కోస్తాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమలోని కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అక్కడక్కడ పిడుగులకు ఆస్కారం ఉందని, అంతా అప్రమత్తంగా వుండాలని తెలిపింది. రానున్న మూడు రోజులు తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది. పిడుగులు పడే ప్రాంతాల్లో అప్రమత్తంగా వుండాలని పేర్కొంది.
ఇదిలా వుంటే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం లేదా రేపటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం వుంది. ఉత్తరాంధ్రలో మేఘా వృతమైంది వాతావరణం. ఈరోజు అక్కడక్కడా చెదురు మదురు వర్షాలు పడతాయి. రేపు మోస్తరు వర్షాలకు అవకాశం వుందని తెలిపింది.
Read Also: Praveen Nettaru Case: ప్రవీణ్ నెట్టారు మర్డర్ కేసు.. 33 చోట్ల ఎన్ఐఏ సోదాలు