GVL Narasimha Rao Satires On Ayyanna Patrudu Comments: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తమ నాయకుడు చంద్రబాబును శ్రీరాముడితో పోల్చడాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రంగా ఖండించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే.. సహించేదే లేదని హెచ్చరించారు. ‘‘భగవంతుడైన శ్రీరాముడితో తమ నాయకుడు చంద్రబాబును పోలుస్తూ.. అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు. ఇతర పార్టీల పొత్తు కోసం పరితపిస్తూ.. ఈ బిల్డప్ ఏంటి? మీ నాయకుడి ఆరాటం ‘లోక’కళ్యాణం కోసం కాదు. ‘లోకేష్’ కళ్యాణార్థం అని అందరికీ తెలుసు’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా జీవీఎల్ చురకలంటించారు.
కాగా.. శనివారం జరిగిన టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో భాగంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ‘‘రావణుడిని వధించేటప్పుడు రాముడు ఉడత నుంచి కోతుల సాయం కూడా తీసుకున్నారు. అదే తరహాలో ఇప్పుడు జగన్‌ను గద్దె దించడానికి అందరి సాయం తీసుకోవాలి. రాముడు భగవంతుడు అయినా, ఎంతో బలవంతుడు అయినా.. అందరి సాయం తీసుకున్నారు. అదే మాదిరిగా చంద్రబాబు కూడా సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అంటూ వ్యాఖ్యానించారు. అంటే, పొత్తులు పెట్టుకోవాలని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జీవీఎల్ సెటైర్లు వేశారు. పొత్తు కోసం పరితపించే చంద్రబాబును.. శ్రీరాముడితో పోల్చడం లాంటి బిల్డప్పుడు ఎందుకని నిలదీశారు.
మరోవైపు.. ఇవే తన చివరి ఎన్నికలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. చంద్రబాబు మాత్రమే కాదని, ప్రజలు కూడా ఇవే ఆయనకు చివరి ఎన్నికలని భావించి గత ఎన్నికల్లో ఓడించారని పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తనకు ఓటమి తప్పదని గ్రహించే, చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అంటూ ప్రజల్ని వేడుకుంటున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.
భగవంతుడయిన శ్రీరాముడితో తమ నాయకుడు @ncbnతో పోలుస్తూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు. ఇతరపార్టీల పొత్తు కోసం పరితపిస్తూ ఈ బిల్డప్ ఏంటి? మీ నాయకుడి ఆరాటం "లోక"కళ్యాణం కోసం కాదు. "లోకేష్"కళ్యాణార్థం అని అందరికీ తెలుసు.
— GVL Narasimha Rao (@GVLNRAO) November 20, 2022