Guntur Mayor Election: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎంపిక టీడీపీ, వైసీపీల్లో హైటెన్షన్ పుట్టిస్తుంది.. నిన్నటివరకూ ఏకపక్షమే అనుకున్న మేయర్ ఎన్నికల్లోకి వైసీపీ అనుహ్యంగా ఎంట్రీ ఇవ్వడంతో టీడీపీ నేతలు ఎలర్ట్ అయ్యారు.. మరోవైపు కూటమి అభ్యర్దిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు.. మేయర్ ఎన్నికపై వైసీపీ విప్ జారీ చేసింది. అయితే, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావటి మనోహర్ తనపదవికి రాజీనామా చేశారు. దీంతో మేయర్ ఎన్నిక అనివార్యం అయ్యింది.. టీడీపీ, వైసీపీ పార్టీలు మేయర్ పదవికోసం పోటీ పడుతుండడంతో ఏం జరుగుతుందోననే టెన్షన్ అందరిలో మొదలయ్యింది. దీంతో వైసీపీ, టీడీపీ నేతలు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. తమ కార్పొరేటర్లను క్యాంపులకు తరలించారు. వాస్తవానికి కార్పొరేషన్ లో వైసీపీకి 46 మంది కార్పొరేటర్ల బలం ఉంది. టీడీపీకి 9, జనసేనకు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందు ఐదుగురు, ఎన్నికల తర్వాత 11 మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోచేరారు. దీంతో కూటమికి కార్పొరేషన్ లో బలం పెరిగింది.
ఇదే సమయంలో మేయర్ పదవికి కావటి మనోహర్ రాజీనామా చేశారు. మొదట్లో మేయర్ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ, వైసీపీ నేతలు తమకు బలం ఉందని, పోటీ చెయ్యకపోతే కూటమికి మేయర్ పదవి దక్కే అవకాశం ఉండడంతో పోటీ చేయాలని భావించింది. ఇందుకు సంబంధించి వైసీపీ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన వారిలో ఒకరిని మేయర్ అభ్యర్దిగా బరిలో దించాలని భావించింది. ఇదే సమయంలో కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్రను ప్రకటించింది. పార్టీ బీఫారమ్ కూడా ఇచ్చింది. దీంతో కోవెలమూడి కలెక్టరేట్ లో మేయర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గత నాలుగేళ్లుగా కార్పొరేషన్ లో జరిగిన అవినీతిపై పోరాడామని, గుంటూరు అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మేయర్ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమంటున్నారు.
Read Also: BRS Rajatotsava Sabha: బీఆర్ఎస్ రజతోత్సవ సభ లైవ్ అప్డేట్స్..
మరోవైపు వైసీపీ కూడా మేయర్ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. గుంటూరు జేసీని వైసీపీ కార్పొరేటర్లు కలిశారు. మేయర్ ఎన్నికలకు సంబంధించి విప్ జారీ చేసేందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించారు. వైసీపీకి చెందిన కార్పొరేటర్లను ప్రలోభపెట్టి టీడీపీలోకి బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. మేయర్ ఎన్నికల్లో వైసీపీ కూడా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లందరికీ విప్ జారీ చేసినట్లు తెలిపారు. విప్ కు విరుద్దంగా ప్రవర్తిస్తే అనర్హత వేటు వేస్తామని తేల్చిచెబుతున్నారు. వైసీపీ విప్ జారీ చేయడంతో మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మేయర్ పీఠం కోసం రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.