వైసీపీ కీలక నాయకులపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్‌తో పాటు వైసీపీ నేతల కుటుంబాలపై ఐ టిడిపి అనే పేరుతో అసభ్య కామెంట్స్ చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ విషయంలో ఈ నెల 17,18,19 తేదీలలో అనేక పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశామన్నారు. ఆ ఫిర్యాదులపై ఇప్పటి వరకు కేసులు కూడా పెట్టినట్లు సమాచారం లేదని అంబటి రాంబాబు తెలిపారు.
Read Also: IPL 2025 Mock Auction: ఐపీఎల్ మాక్ వేలంలో రికార్డ్ ధరలకు అమ్ముడుబోయిన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్
వైసీపీ సోషల్ మీడియా ఆక్టివిస్ట్‌లను అరెస్టు చేస్తున్నారు.. ఇప్పటికీ 100 మందిపై కేసులు పెట్టారని అంబటి రాంబాబు తెలిపారు. వైసీపీ నేతలపై టీడీపీ నాయకుల ట్విట్టర్‌లో సైతం దుర్భాషలాడుతున్నారని ఆరోపించారు. తాము 10 ఫిర్యాదులు చేస్తే ఒక్క కేసు నమోదు కాలేదన్నారు. కానీ వైసీపీ క్యాడర్ పై 300 కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. టీడీపీ నాయకుల చెప్పు చేతల్లో పోలీసు వ్యవస్థ పని చేస్తున్నట్లు కనిపిస్తుంది.. ఇలాగే పోలీసులు ప్రవర్తిస్తే తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు.
Read Also: Champai Soren: చంపై సోరెన్ జయకేతనం.. సెరైకెలా నుంచి గెలుపు
తప్పు ఎవరు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవాలి.. మాజీ మంత్రులు ఫిర్యాదునే పట్టించుకోక పొతే ఎలా..? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇదే విషయం పై పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తాం.. తాము ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన కేసులు నమోదు చేయడం లేదన్నారు. ఐదు స్టేషన్‌లలో తాము ఇచ్చిన పది ఫిర్యాదులలో కేసులు నమోదు చేయాలి.. లేదంటే ఉన్నత న్యాయ స్థానాలలో ప్రైవేటు కేసులు వేస్తామని అంబటి రాంబాబు తెలిపారు.