చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ చిత్రపటానికి ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా బంగారు పూలతో అభిషేకం నిర్వహించారు. అదేవిధంగా పాలాభిషేకం కూడా చేశారు. ఇటీవల తమకు ప్రభుత్వం 23 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించడమే కాకుండా రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచినందుకు ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు వారు ధన్యవాదాలు తెలియజేశారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువగానే సీఎం జగన్ వరాలు కురిపించారంటూ సంబరపడిపోయారు.
Read Also: మంచులో కూరుకుపోయి 22 మంది పర్యాటకులు మృతి
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ఎవరూ ఊహించలేదని ప్రభుత్వ ఉద్యోగులు తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వ ఉద్యోగుల పక్షపాతి అని నిరూపించుకున్నారని అన్నారు. అలాగే రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచడం సంతోషకరమన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన పీఆర్సీ, 5 డీఏలు ఇస్తామనడం తమకు చాలా ఉపయోగపడుతుందన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం దిశగా ఆదేశాలు ఇచ్చినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.