నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నదిలో వరద ప్రవాహం ‘ప్రమాద’కరంగా పెరుగుతోంది. ఒక్కో అడుగూ పెరుగుతూ ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం 13.3 అడుగుల వద్దకు చేరింది. దీంతో మరికొద్దిసేపట్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేయనున్నారు. కోనసీమలో గోదావరి ఉధృతంగా ప్రవాహిస్తుండటంతో అధికార యంత్రాంగం హైఅలర్ట్ అయింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్‌ఎఫ్)ను, రెస్క్యూ టీంలను అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర అర్ధరాత్రి 12 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
నీటిమట్టం 11.75 అడుగులకి చేరుకున్నప్పుడు 10.02 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తివేశారు. కోనసీమ జిల్లాలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు 200 బోట్లను ఏర్పాటుచేశారు. అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలు చేశారు. దీంతో అధికారులు పి.గన్నవరం మండలంలోని లంక గ్రామాల్లో పర్యటించి స్థానికుల్లో ధైర్యం నింపారు. నీటిమట్టం 13.2 అడుగులకు చేరుకున్నప్పుడు బ్యారేజ్ నుంచి 12 లక్షల 10 వేల క్యూసెక్కుల నీటికి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
నీటి మట్టం మరో అడుగు పెరగటంతో బ్యారేజ్ నుంచి 12 లక్షల 30 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. తెలంగాణలోని దుమ్ముగూడెం వద్దకు 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. భద్రాచలం వల్ల నీటి మట్టం 53.4 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు చివరి (మూడో) ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం భారీగా పెరగటంతో రామాలయ మాడ వీధులు, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్‌ను వరద చుట్టుముట్టింది. సమీప మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 600 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు.