రాష్ట్రఅవతరణ దినోత్సవం రోజున వైఎస్సార్ అవార్డుల కార్యక్రమాన్ని జరపడాన్ని ట్విట్టర్ వేదికగా మాజీమంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తప్పు పట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణతో ఏ సంబంధం లేని మీ తండ్రి వైఎస్సార్ గారి పేరుపెట్టి ఈ రోజు పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం తప్పని ఇది సరికాదని, మహానీయుడు పొట్టిశ్రీరాములును అవమానించడమేనన్నారు.
పొట్టిశ్రీరాములు గారి ఆత్మార్పాణతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం.. అమరజీవికి ఓ దండ వేసి చేతులు దులుపుకోవడం దుర్మార్గమన్నారు. మన రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాల్నే తృణప్రాయంగా వదిలేసిన పొట్టిశ్రీరాములు త్యాగాన్ని అపహాస్యం చేసేలా ప్రభుత్వం వ్యవహరించిందని అయ్యన్న పాత్రుడు ప్రభుత్వాన్ని విమర్శించారు. వైఎస్సార్ జయంతి, వర్థంతి సందర్భంగా ఆయన పేరుతో అవార్డులు ఇచ్చు కుంటే తప్పులేదని కానీ ఈ పొట్టి శ్రీరాములు పేరుతో కాకుండా వైఎస్సార్ పేరుతో అవార్డులు ఇవ్వడమేంటని అయ్యన్న పాత్రుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.