కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే వుంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక మరణాలు సంభవించినవి భారత్ లోనే. దేశంలో ఇప్పటివరకూ 5 లక్షలమంది కోవిడ్ 19 కారణంగా మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది జులై 1కి మనదేశంలో మరణాలు నాలుగు లక్షలు నమోదయ్యాయి. 217 రోజుల్లో మరో లక్ష మరణాలు సంభవించాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మరణాలు 5,00,055కి చేరాయి. గత 24 గంటల్లో 1,49,394 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,072 మంది మరణించారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 1,42,859 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా కేరళ (56,701), కర్ణాటక (39,197), తమిళనాడు (37,666), ఢిల్లీ (25,932), ఉత్తర ప్రదేశ్ (23,277)లు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 9.27 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4.19 కోట్లకు చేరగా, వాటిలో యాక్టివ్ కేసులు 14 లక్షల 35 వేల 569 కి చేరింది.