ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న శ్రీశైలం జలాశయానికి అంచనాలకు మించి వచ్చే వరద నీటిని మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని నిపుణుల కమిటీ హెచ్చరించింది. లేకపోతే శ్రీశైలం డ్యామ్ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని కమిటీ స్పష్టం చేసింది. కొత్తగా స్పిల్ వే నిర్మించడం లేదా డ్యాం ఎత్తు పెంచడం, కుడి కాల్వ, ఎడమ కాల్వల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయడం వంటి అంశాలను పరిశీలించాలని నిపుణుల కమిటీ కీలక సూచనలు చేసింది. ప్లంజ్‌పూల్ సహా డ్యాం, స్పిల్‌వేకు మరమ్మతులు, పునరావాస చర్యలకు వెంటనే శ్రీకారం చుట్టాలని సిఫారసు చేసింది.
శ్రీశైలం డ్యామ్ భద్రతపై కొన్నేళ్లుగా పలు కమిటీలు ఏర్పాటయ్యాయి. అయితే పలు కమిటీలు ఎన్ని సిఫారసులు చేసినా అవి ఆచరణకు నోచుకోలేదు. 2020 ఫిబ్రవరిలో కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్యా ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటైంది. 2021లో సీడబ్ల్యూసీ శ్రీశైలం వరద ప్రవాహంపై అధ్యయనం చేసి అధికారులకు ఓ నివేదిక సమర్పించింది. గత కమిటీల సిఫారసులు, సీడబ్ల్యూసీ పరిశీలనలో తేలిన అంశాలు, చర్యలపై పాండ్యా కమిటీ ఇటీవల తుది నివేదిక ఇచ్చింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న స్పిల్ వే సామర్థ్యానికి తగినట్లు లేదని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న స్పిల్ వే సామర్థ్యం 13.2 లక్షల క్యూసెక్కులు మాత్రమే అని తెలిపింది. గరిష్ట నీటిమట్టం 890 అడుగులను పరిగణననలోకి తీసుకుంటే స్పిల్ వే సామర్థ్యం 14.55 లక్షల క్యూసెక్కులుగా ఉండాలని తేల్చి చెప్పింది.