విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసనల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభమైంది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీతారామన్ పాల్గొననున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో నేడు నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్ ఫెస్టివల్లో పాల్గొంటారు ఆర్ధిక మంత్రి. తర్వాత విశాఖలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సందర్శిస్తారు. రేపు నిర్మలా సీతారామన్ విశాఖ జిల్లాలో పర్యటిస్తారు. గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మృతివనంను సందర్శించనున్నారు. తాళ్లపాలెంలో రేషన్ పంపిణీ విధానం పరిశీలించనున్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్ధిక శాఖ అధికారులు హాజరుకానున్నారు. నిర్మలా సీతారామన్ పర్యటనకు ముందు ఎయిర్ పోర్ట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనను వ్యతిరేకిస్తూ ఆర్థిక మంత్రికి వినతులు ఇచ్చేందుకు వందల మంది కార్మికులు వచ్చారు. అనుమతి లేకపోవడంతో వారిని పోలీసులు ఎక్కడిక్కక్కడ అడ్డుకున్నారు. హైవేపై బైఠాయించి ఆందోళన చేస్తున్న జెఏసీ నాయకులు, కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మలా సీతారామన్ గో బ్యాక్ నినాదాలతో అక్కడి వాతావరణం వేడెక్కింది. పోలీసుల రక్షణ వలయం మధ్య కేంద్ర మంత్రి పర్యటన ప్రారంభమైనప్పటికీ ఇవాళ, రేపు టూర్ ఏవిధంగా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది.