ఏపీలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. ఎక్కడైనా అధికార, విపక్షాల మధ్య వార్ ఉంటుంది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం స్వపక్షంలో విపక్షం అన్న పరిస్థితి నెలకొంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ కొందరు నేతల మధ్య వార్‌కు కారణంగా మారింది. నెల్లూరు జిల్లాలో తనకు మరోసారి మంత్రి పదవి రాకపోవడంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కినుక వహించినట్లు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి జిల్లాకు వస్తున్న రోజే మాజీ మంత్రి బహిరంగ సభ నిర్వహిస్తుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 17న నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించనున్నారు. అయితే అదే రోజు నెల్లూరు నగరంలోమాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈనెల 17న సాయంత్రం 5 గంటలకు నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో మాజీ మంత్రి అనిల్ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభ నిర్వహణపై నేతలు, కార్యకర్తలతో అనిల్ మంతనాలు జరిపారు. ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈనెల 17న సాయంత్రం 5:30 గంటలకు మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు చేరుకోనున్నారు. మరి మంత్రి కాకాని పర్యటనలో అనిల్ పాల్గొంటారా లేదో వేచి చూడాలి. ఇప్పటికే ప్రమాణస్వీకారానికి మంత్రి కాకాని గోవర్ధన్ తనకు ఆహ్వానం పంపలేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.