11వ పీఆర్సీపై ఏపీలో మళ్లీ నిరసన జ్వాలలు రగులుతున్నాయి. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కాయి. దీంతో ఉద్యోగులతో పలుమార్లు చర్చలు జరిపి, కమిటీలు వేసి చివరికి ఇటీవల సీఎం జగన్ పీఆర్సీపై ప్రకటన చేశారు. అయితే ప్రకటనకు ముందు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. కోవిడ్ కారణంగా ఫిట్మెంట్, హెచ్ ఆర్ ఏ లాంటి వాటిని తగ్గించాలని ఉద్యోగ సంఘాలకు సూచించింది. చర్చల తరువాత ఉద్యోగ సంఘాల నేతలు మా ప్రధాన సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం విడుదల చేసిన జీవోలతో ఉద్యోగులు నష్టపోతారని, మరోసారి ప్రభుత్వంతో చర్చలు జరిపి.. చర్చలు ఫలించకుంటే.. సమ్మెకు సిద్ధమవుతామని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఉద్యోగ సంఘాలు ఏకమయ్యాయి. ఈ క్రమంలో విజయవాడలోని ఓ హోటల్ లో రహస్యంగా ఉద్యోగ సంఘాల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకటరామిరెడ్డి హాజరైనట్లు తెలుస్తోంది. జేఏసీగా ఏర్పాటుకు ఏపీ జేఏసీ,ఏపీ జేఏసీ అమరావతి, గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్లు సిద్ధమయ్యాయి. జేఏసీగా కలిసి పనిచేసేందుకు ఉద్యోగ సంఘాలు అంగీకారానికి వచ్చాయి. ఉమ్మడిగా పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకున్నాయి.