Kethireddy Venkatarami Reddy: సీఎం చంద్రబాబు బానే ఉంటారు.. భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఏపీ లిక్కర్ స్కామ్ అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో ఇవాళ అనంతపురం వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సుగాసి బాల సుబ్రమణ్యం.. మిథున్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు చేసినా మిథున్ రెడ్డి జైల్లో చాలా ధైర్యంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు బానే ఉంటారనీ, భవిష్యత్తులో పోలీసు అధికారులు ఇబ్బందులు పడతారని వార్నింగ్ ఇచ్చారు.. మరోవైపు, రాజధాని అమరావతి ఇప్పుడు గోదావరిలా మారిందని.. మరో రెండేళ్లలో అమరావతిలో పులస చేపలు కూడా లభిస్తాయనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Read Also: Telangana Weather Alert: రాబోయే 24 గంటలు భారీ వర్షాలు.. నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్
మరోవైపు, మాజీ సీఎం జగన్ జాతీయ జెండా ఎగరవేయకపోవడంపై కేతిరెడ్డి స్పందిస్తూ…. జాతీయ జెండా ఎగరవేస్తేనో, చాక్లెట్లు పంచితేనో దేశభక్తి ఉన్నట్లు కాదనీ, దేశం యొక్క సమగ్రతకు, ఐక్యతకు పోరాడితే దేశభక్తి అవుతుందని అన్నారు. చంద్రబాబు ఆడుతున్న నాటకంలో పోలీసులు పావులు అవుతున్నారు.. రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలు అవుతుందో స్పష్టం కావడం లేదన్నారు.. ఇవాళ ఏ విత్తనమేస్తే రేపు వాటి రుచి మీరు కూడా చూడాల్సి ఉంటుందన్నారు.. ప్రజాస్వామ్యాన్ని కోర్టులను గౌరవించాలని సూచించారు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. ఇక, అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి.. లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు కట్టు కథ అని కొట్టిపారేశారు.. వైసీపీ నేతలను మానసికంగా వేధించే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. పార్టీని బలహీనపరచడానికి అక్రమ అరెస్టులు జరుపుతున్నారు.. నియోజకవర్గంలో బలమైన వైసీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.. జైల్లో మిథున్ రెడ్డికి సరైన సదుపాయాలు కల్పించడం లేదు.. కోర్టు ఉత్తర్వులున్నా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వకుండా నిలుపు చేస్తున్నారు.. చట్టం పట్ల లోకేష్ కు ఎటువంటి ఆలోచన ఉందో దీనిని బట్టి అర్ధం అవుతుందన్నారు.. కడిగిన ముత్యం మాదిరిగా వైసీపీ నేతలంతా బయటకు వస్తారని పేర్కొన్నారు అనంత వెంకటరామిరెడ్డి .