భారత క్రికెట్ వర్గాల్లో ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మళ్లీ టీమిండియాకు సేవలందించేందుకు రాబోతున్నాడా? అంటే.. అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఇప్పుడు రవిశాస్త్రి రీఎంట్రీ సోషల్ మీడియా, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 2029 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) వరకు రవిశాస్త్రిని టెస్ట్ జట్టు కోచ్‌గా తిరిగి తీసుకురావాలని బీసీసీఐ గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
రవిశాస్త్రి కోచింగ్‌లో భారత్ టెస్ట్ క్రికెట్‌లో అద్భుత విజయాలు అందుకుంది. ఆస్ట్రేలియాలో వరుసగా టెస్ట్ సిరీస్ విజయాలు, విదేశీ గడ్డపై దూకుడైన ఆటతీరుతో రవిశాస్త్రి–విరాట్ కోహ్లీ కాంబినేషన్ ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఈ నేపధ్యంలోనే మరోసారి ఆ జోడీని తీసుకురావాలన్న ఆలోచన బీసీసీఐలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో రవిశాస్త్రి ఓ షరతు పెట్టాడని సమాచారం. విరాట్ కోహ్లీని మళ్లీ టెస్ట్ జట్టులోకి తీసుకురావాలని, అతడిని కెప్టెన్‌గా నియమిస్తేనే.. తాను కోచ్‌గా బాధ్యతలు స్వీకరిస్తానని బీసీసీఐకి చెప్పాడట. కోహ్లీ కెప్టెన్సీ లేకుండా తాను ఈ బాధ్యత చేపట్టబోనని స్పష్టంగా చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.
విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. ప్రస్తుతం వన్డే జట్టులో సీనియర్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. టీ20, టెస్టులకు అతడు వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. విరాట్ నాయకత్వంలో టీమిండియా చూపిన దూకుడు, ఫిట్‌నెస్ సంస్కృతి, విదేశీ విజయాలు ఇప్పటికీ అభిమానుల మనసుల్లో చెరగని ముద్రగా ఉన్నాయి. అందుకే మళ్లీ కోహ్లీని టెస్టుల్లో చూడాలనే డిమాండ్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. అయితే ఒకసారి రిటైర్ అయ్యాక రీఎంట్రీ ఇచ్చేడి లేదని కోహ్లీ ఇప్పటికే స్పష్టం చేశాడు. సో రవిశాస్త్రి రీఎంట్రీ కూడా అసాధ్యమనే చెప్పాలి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హయాంలో భారత్ టెస్టుల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.