YSRCP: నెల్లూరు జిల్లా వైసీపీలో వర్గపోరు ముదిరింది. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావుపై పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో జెడ్పీటీసీ ఊటుకూరు యామిని రాజీనామాకు సిద్ధమయ్యారు. ఇదేబాటలో మరికొంతమంది ఎంపీటీసీలు కూడా ఉన్నారు. సచివాలయ కన్వీనర్ల నియామకంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు వైఖరిపై పలువురు వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తమను సంప్రదించకుండానే పదవుల నియామకం చేపట్టారని ఆరోపిస్తున్నారు. పదవి లేకుండా అయినా ఉండగలమేమో కానీ విలువ లేని చోట ఉండలేమని జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అంటున్నారు.
Read Also: Andhra Pradesh: త్వరలో టీటీడీకి కొత్త పాలకమండలి.. ఛైర్మన్‌గా భూమన?
గూడూరు ఎమ్మెల్యే తీరుతో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన వారికి ఎమ్మెల్యే విలువ ఇవ్వడం లేదని వైసీపీ నాయకులు, కార్యకర్తల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ యామినితో పాటు అనుచరులతో జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి చర్చిస్తున్నారు. మరోవైపు గూడురు ఎమ్మెల్యే వరప్రసాదరావు వ్యవహారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి వెళ్లింది. దీంతో పలువురు వైసీపీ నేతలు తిరుపతిలో సజ్జలను కలిసేందుకు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.