బీహార్‌లోని పశువుల దాణా కుంభకోణం తరహాలోనే ఏపీ ప్రభుత్వం మూగజీవాల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర వ్యాఖ్యనించారు. ఆర్బీకేల ద్వారా వల్లభ ఫీడుని అమ్ముడుతున్నారని, అది ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిది కాదా? అని ప్రశ్నించారు. ఫెర్టయిల్ గ్రీన్ అనే కంపెనీ ద్వారా పశువుల మేత కోసం వినియోగించే టీఎంఆర్‌ను మెట్రిక్ టన్ను రూ. 16 వేలకు కొనుగోలు చేస్తున్నారన్నారు. వెటర్నరీ డాక్టర్లకు టార్గెట్ పెట్టి మరీ.. ఆ కంపెనీ సరఫరా చేసే మేతనే కొనుగోలు చేయాల్సిందిగా రైతులపై ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ ప్రజలు గతంలో మునుపెన్నడూ చూడని నరకాన్ని మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చూపిందని నరేంద్ర దుయ్యబట్టారు. సీఎం జగన్ నెలకు ఒక్కసారైనా సచివాలయానికి కూడా రావడం లేదని, జగన్ సీఎం అయినప్పటి నుంచి ఏపీని చాలా సంక్షోభాలు తాకాయని విమర్శించారు. ఈ మూడేళ్ళలో ప్రత్యేక హోదా సాధనకు జగన్ ఏం చేశారని నిలదీశారు. జగన్ సీఎం అయ్యాక ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయి కానీ.. రైతు అమ్ముకునే ధాన్య ధర పెరగలేదన్నారు. ఈ ప్రభుత్వం పంటల బీమాను గాలికొదిలేసిందని, పంట విలువ కంటే తక్కువకే ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తోందన్నారు. నామమాత్రంగా బీమా చేస్తూ రైతుల్ని ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. పంట విస్తీర్ణం పెరిగి, దిగుబడి తగ్గిందని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయని.. 11 శాతం దిగుబడి తగ్గిందని సర్కార్ గణంకాలే స్పష్టం చేస్తున్నాయని నరేంద్ర వివరించారు.
రైతు రుణమాఫీ విషయంలో టీడీపీ అమలు చేసినదాన్ని తామేందెకు కట్టాలని చెప్పిన జగన్ ప్రభుత్వం.. గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు ఓటీఎస్ ఎలా అమలు చేస్తారని నరేంద్ర ప్రశ్నించారు. గులాబ్, జవాద్ వంటి విపత్తుల్లో 9.52 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, ఒక్క పైసా కూడా ప్రభుత్వం విదల్చలేదన్నారు. పశువులు చనిపోతే డబ్బులుస్తామన్న ప్రభుత్వం.. సుమారు రూ. 100 కోట్లు పెండింగులో పెట్టిందన్నారు. గోపాల మిత్ర వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహించారు. ఏపీలో అమలయ్యేలా పథకాల్లో 60 శాతం కేంద్ర నిధులతోనే చేపడుతున్నారని.. మరి ఆ పథకాల్లో మోదీ ఫోటోని వాడుతున్నారా? అంటూ ధూళిపాళ నరేంద్ర ప్రశ్నించారు.