Dharmana Prasada Rao Fires On Chandrababu Naidu: ఒక రాజధాని సమస్యను రాష్ట్ర సమస్యగా సృష్టిస్తున్నారని.. ఇది చంద్రబాబు ఎత్తుగడేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని వెనుక ఉన్న దురుద్దేశాలను తాము బయటపెట్టామని, అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ కూడా జరిగిందని అన్నారు. అనుభవాలతో పాటు వాస్తవాలను కూడా తెలిపామన్నారు. హైదరాబాద్‌ను విడదీయడాన్ని వద్దని రాష్ట్ర ప్రజలు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. గడిచిన 65 సంవత్సరాలు పెట్టుబడి అంతా హైదరాబాద్‌లోనే పెట్టామని, అభివృద్ధి అక్కడే జరిగిందని, అందుకే తెలంగాణ వారు రాష్ర్ట విభజన కోరుకున్నారని చెప్పారు. ఒకవేళ రాష్ర్ట నలుములలా అభివృద్ధి జరిగి ఉంటే.. ప్రత్యేక తెలంగాణ కోరేవారు కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో జరిగిన పని, మళ్లీ జరగదని ఎవరైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు.
మరోసారి ఉత్తరాంధ్రను పొమ్మంటే మరింత వెనుకబడతామని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు మరుగున పెట్టారని నిలదీశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, ఎందుకు ఒకే ప్రాంతంపై చంద్రబాబు దృష్టి పెడుతున్నారని అడిగారు. ఆయన ఆలోచనలో స్వార్థం ఉంది కాబట్టే, అమరావతిపై ఫోకస్ పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు స్నేహితులు, బందువుల చేత భూములకు కేటాయింపు చేశారని ఆరోపణలు చేశారు. దొనకొండ, నూజవీడుని కాదని.. రాజధాని ప్రాంతాన్ని ఎందుకు దాచిపెట్టారన్నారు. వైఎస్ జగన్‌గానీ, ఈ ప్రభుత్వం గానీ అమరావతి వద్దని చెప్పలేదని.. ప్రజలకు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారని నిలదీశారు. విశాఖ క్యాపిటల్ వద్దంటే ఎందుకు ఊరుకుంటామన్నారు. 23 కేంద్ర సంస్థలు వస్తే.. ఒక్కటి కూడా శ్రీకాకుళంలో పెట్టలేదని వెల్లడించారు. రైతుల మాటున ప్రజల రాజ్యాంగ హక్కులు కాలరాస్తూ.. నోరు నొక్కితే తాము ఊరుకునేదే లేదని ధర్మాన ప్రసాదరావు హెచ్చరించారు.