Karthika Masam: తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో భారీగా భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళలు కార్తీక దీపాలు వదిలారు. ముక్కంటిని దర్శించుకుని భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. దీంతో శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో పవిత్ర కార్తీకమాసం ఆదివారం కావడంతో భక్తుల రద్దీ నెలకుంది. వేకువ జామున నుండే సుదూర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకోని త్రివేణి సంగమ గోదావరి నదిలో కార్తీక పుణ్యస్నానాలు ఆచరించి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదావరిలో దీపాలు వదిలారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మారేడు దళాలు సమర్పించి , అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శ్రీ శుభానంద దేవి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద లక్ష ముగ్గు, దీపాలు వెలిగించి, ప్రదక్షణలు చేశారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా కార్తీక మాసం ఆదివారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవారాల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఆలయం ముందు భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. నేడు, రేపు గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలో వారాంతపు సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో క్షేత్రానికి చేరుకుని తమ ఇష్టదైవాలను దర్శించుకున్నారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి నిజాభిషేకం, అర్చన, నిత్య కల్యాణం, వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్కింగ్ స్థలం వాహనాలతో నిండిపోవడంతో పాటు క్షేత్రం చుట్టూ ఉన్న రింగ్ రోడ్డుపై కూడా వాహనాలు నిలిచిపోయాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దీపారాధన, సత్యదేవుని వ్రత పూజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కొండపై గర్భగుడిలోని పంచనారసింహుడితో పాటు శివాలయంలో పర్వతవర్ధినితో పాటు రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీశైల మహాక్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం సెలవులు కావడంతో ఆదివారం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఉత్తర మాఢవీధి ప్రాంగణంలో, ఆలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపంలో దీపారావధానం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మపథంలో నిత్యకళారావధానం ఆకట్టుకుంది.
AP Rains: ఏపీకి మూడురోజుల పాటు భారీ వర్ష సూచన..