పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం వైఖరిపై మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ మౌనం రైతులకు శాపంగా మారిందని.. ఇప్పటికైనా సీఎం జగన్ నోరు విప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. జోకర్ లాంటి జలవనరుల మంత్రి అంబటి రాంబాబుతో పిచ్చి మాటలు మాట్లాడిస్తే సరిపోదన్నారు. చంద్రబాబు, దేవినేని ఉమాని తిడితే పోలవరం పూర్తికాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. సీఎం జగన్ మూర్ఖత్వం, డబ్బు వ్యామోహం, తెలివి తక్కువతనం, అవగాహనారాహిత్యమే పోలవరానికి శాపాలుగా మారాయని దేవినేని ఉమా ఆరోపించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పోలవరం ఎత్తు తగ్గిస్తారన్నప్పుడు జగన్ ఎందుకు నోరు తెరవలేదని ప్రశ్నించారు.
Andhra Pradesh: నీటి కేటాయింపులపై వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం
ఎన్నికల్లో నిధులు తెచ్చుకున్న దానికి ప్రతిఫలంగా పోలవరాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ వద్ద జగన్ తాకట్టు పెట్టారని దేవినేని ఉమ విమర్శలు చేశారు. పోలవరం నిర్మాణంపై పొరుగు రాష్ట్ర వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడం జగన్ అసమర్థత కాదా అని నిలదీశారు. టీడీపీ హయాంలో రూ.55,548 కోట్లకు ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం ఆమోదం పొందితే.. ఇప్పుడు వెదిరే శ్రీరామ్ అనే వ్యక్తి రూ.9 వేల కోట్లు చాలంటే విజయసాయిరెడ్డి ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. 2020లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే 2021, 2022 జూన్ , 2023 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని జగన్ ఎలా చెప్పారన్నారు. సీబీఐ, ఈడీ కేసుల భయంతో పోలవరాన్ని తాకట్టు పెడతారా అని మండిపడ్డారు. ప్రధాని మోదీతో మాట్లాడి ముఖ్యమంత్రి ఎందుకు రూ.55,548 కోట్లు సాధించలేక పోతున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు.
రూ. 800 కోట్లతో గుంతలు పూడుస్తాం.. 2వేల కోట్లతో నీళ్లు తోడతామంటూ అంబటి రాంబాబు ఎన్నాళ్లు కబుర్లు చెప్తారన్నారు. పోయిన మంత్రేమో బుల్లెట్ దిగుద్ది అన్నాడని.. వచ్చిన మంత్రికేమో పులిచింతల చూడగానే నోరు పడిపోయిందని దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. పులిచింతల గేట్ కొట్టుకుపోయి నెల రోజులైతే అంబటి రాంబాబు ఏం చేస్తున్నారని.. మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశారా అని నిలదీశారు. 6 ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో ఎన్ని పూర్తి చేశారో చెప్పాలన్నారు. పరిపాలన చేతకాకపోతే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. నిర్వాసితుల సొమ్ముని వైసీపీ వారు పందికొక్కుల్లా తింటుంటే సీఎం జగన్‌కి, అంబటి రాంబాబుకి కనిపించడం లేదా అని అడిగారు. ఎత్తిపోతల పథకాల్లోని లొసుగుల్ని ఎత్తిచూపిన వారిని తిడితే రైతులకు నీళ్లు అందవనే విషయాన్ని అంబటి రాంబాబు గుర్తుపెట్టుకోవాలని దేవినేని ఉమ హితవు పలికారు.