సత్యసాయి జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. నీటి కేటాయింపు విషయంలో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య భేదాభిప్రాయాలు బహిర్గతం అయ్యాయి. గత ఏడాది ఏ విధంగా నీటి కేటాయింపులు జరిగాయో ఈ ఏడాది కూడా అదే విధంగా నీటి కేటాయింపులు జరగాలని పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ డిమాండ్ చేశారు. అయితే తన నియోజకవర్గానికి ఆయకట్టు ప్రాతిపదికన కేటాయింపు జరగాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోరారు. అన్ని నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి అల్టీమేటం జారీ చేశారు.
దీంతో జిల్లా అభివృద్ధి సలహా మండలి సమావేశంలో అరగంట పాటు రాప్తాడు, పెనుగొండ, మడకశిర ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మంత్రి గుమ్మనూరు జయరాం జోక్యం చేసుకుని ఎమ్మెల్యేలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. నీటి కేటాయింపు సమస్యను జఠిలం చేయవద్దని.. అందరం కూర్చొని మాట్లాడుకుందాం అని మంత్రి గుమ్మనూరు జయరాం సూచించడంతో ఎమ్మెల్యేలందరూ శాంతించారు.