నారా లోకేష్ పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ఎన్ఆర్ పురం గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ పరిజ్ఞానం లేని లోకేష్ నీకెందుకు ఈ పాదయాత్ర..? అని ప్రశ్నించారు.. ఎవరిని ఉద్ధరించడానికి చేస్తావ్ ఈ పాదయాత్ర..? అని నిలదీసిన ఆయన.. వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేని నువ్వు ముఖ్యమంత్రి అయిపోవాలని పగటి కలలు కంటున్నావు అంటూ ఎద్దేవా చేశారు.. నువ్వు ఎన్ని జన్మలెత్తినా వార్డు మెంబర్‌గా కూడా గెలవలేవని జోస్యం చెప్పారు.. ఇక, మీ తండ్రి సొంత మామ (ఎన్టీఆర్)ని వెన్నుపోటు పొడిచాడు.. నువ్వు మీ తండ్రిని వెన్నుపోటుపోవడానికి సిద్ధమయ్యావా?.. అందుకేనా ఈ యాత్ర..? అంటూ సెటైర్లు వేశారు.
Read Also: TSPSC : నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-3 నోటిఫికేషన్ రిలీజ్
ఇక, నువ్వు మీ తండ్రి చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్, మీరందరూ కలిసి ఎన్ని యాత్రలు చేసినా ప్రజల ఎవ్వరూ మిమ్ములను నమ్మే పరిస్థితులో లేరని.. కులాలను మతాలను విభజించి పాలించడం చంద్రబాబు నాయుడుకి అలవాటే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైన విషయం విదితమే.. 2023 జనవరి 27వ తేదీన పాదయాత్ర ప్రారంభించబోతున్నారు.. లోకేష్ పాదయాత్రకు ‘యువగళం’ పేరును ఇప్పటికే ఖరారు చేశారు. 400 రోజుల పాటు 4000 వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేయబోతున్నారు.. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చిన విషయం విదితమే.