ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీకి శాశ్వత అధ్యక్షుడిగా సీఎం వైఎస్ జగన్‌ని నియమించటం చట్టవిరుద్ధమని సీపీఐ నారాయణ అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్-29ఏ ప్రకారం ఈ తీర్మానం చెల్లదని చెప్పారు. ఈ మేరకు ఆయన నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గ ప్రజాస్వామ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఓట్ల ప్రక్రియ ద్వారానే అధ్యక్షుడు సహా మొత్తం కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. నిబంధనలు కూడా ఇవే చెబుతున్నాయని గుర్తు చేశారు. రెండు, మూడేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ కూడా ఇలాగే పార్టీ రూల్స్ మార్చడంతో ఎన్నికల సంఘం నోటీసులిచ్చిందని వెల్లడించారు. తాజాగా వైఎస్సార్సీపీ జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవటంపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలని సీపీఐ నారాయణ చెప్పారు. అయితే వైఎస్సార్సీపీ తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే చూపిన మార్గంలోనే జగన్‌ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు వార్తలు వచ్చాయి. కరుణానిధిని డీఎంకే పార్టీ లైఫ్ టైమ్ ప్రెసిడెంట్‌గా తీర్మానించటాన్ని ఈసీ ఆమోదించింది. అందుకే ఆయన బతికున్నంత కాలం అధ్యక్షుడిగా కొనసాగారు. కరుణానిధి తర్వాత ఆయన కొడుకు ఎంకే స్టాలిన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.