పొలంలో వేసుకున్న మట్టికట్ట ఆ రైతు ప్రాణాలమీదకు తెచ్చింది… అలా అవుతుందని అతను ఊహించి వుండడు. వరదనీరు పోవడం లేదంటూ అధికారులు పొలం మట్టికట్ట తొలగించేందుకు ప్రయత్నిచారు… పోలీసులతో రైతును అడ్డుకోవడంతో మనస్తాపం చెందాడు… పోలీసుల సమక్షంలోనే పురుగు మందు తాగిన రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.మట్టికట్ట తవ్వేందుకు ప్రయత్నిస్తున్న అధికారులు, పోలీసులను అడ్డుకున్నాడు నందకిషోర్. అతనిది పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరు. నందకిషోర్ కు గ్రామంలో 11ఎకరాల పొలం ఉంది. ఈ పొలంలో ఆరెకరాలు సాగు చేస్తున్నాడు. మిగతా ఐదెకరాలు పల్లంలో ఉంది. దీంతో గ్రామంలోని కళింగవాగు పొంగితే పల్లంలో ఉన్న ఐదెకరాల పొలం నీటమునిగిపోతుంది. దీంతో సాగుకు ఇబ్బందిగా మారింది. నాలుగు నెలల క్రితం తన పొలం ముంపుకు గురికాకుండా ఐదులక్షలు ఖర్చుపెట్టి పొలం చుట్టూ మట్టికట్ట ఏర్పాటు చేసుకున్నారు. అంతవరకూ బాగానే ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు కళింగవాగుకు వరదనీరు వచ్చి చేరింది.
నందకిషోర్ పొలం వద్ద ఉన్న చప్టాపైనుంచి నీరు ప్రవహించింది. పొలానికి వేసిన మట్టికట్ట వల్ల వరదనీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందని అధికారులు భావించారు. వాగు పక్కనే ఉన్న పోరంబోకు స్థలం తవ్వితే వరదనీరు పోతుందని నందకిషోర్ కుటుంబం అధికారులకు చెప్పింది. నాలుగు రోజుల క్రితం మట్టికట్ట తవ్వడానికి వచ్చిన అధికారులను నందకిషోర్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తమ పొలంలో వేసుకున్న మట్టికట్టను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. దీంతో అధికారులు వెనక్కు వెళ్లిపోయారు. మళ్లీ పోలీసులతో వచ్చిన రెవెన్యూ అధికారులు మట్టికట్ట తొలగించేందుకు సిద్దమయ్యారు. అధికారుల ప్రయత్నాన్ని గమనించిన నందకిషోర్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.
మట్టికట్ట తొలగించేందుకు వచ్చిన ప్రొక్లైనర్ కు అడ్డంగా కూర్చుకున్నారు. దీంతో పోలీసులు బలవంతంగా నందకిషోర్ తమ్ముడు, మేనత్త, కుటుంబ సభ్యులను పక్కకు లాగేశారు. మనస్తాపానికి గురైన నందకిషోర్ పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే నందకిషోర్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నందికిషోర్ మృతిచెందాడు. తన అన్న మృతికి అధికారుల తీరే కారణమని మండిపడుతున్నారు.
మరోవైపు రాజకీయ కారణాలతోనే తమ పొలంలో ఏర్పాటు చేసుకున్న మట్టికట్ట తొలగించేందుకు ప్రయత్నించారని నందకిషోర్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తాము తెలుగుదేశం పార్టీకి చెందినవారని అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటున్నారు. తమ పొలంలో వేసుకున్న మట్టికట్ట తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. ఒకవేళ మట్టికట్ట తొలగించాలంటే ముందుగా నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. నందకిషోర్ మృతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల తీరుపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఏకపక్షంగా వ్యవహరించి రైతు మృతికి కారణమైన వారిపై న్యాయపోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించకుండా వ్యవహరించిన రెవెన్యూ అధికారులు, పోలీసులపై కేసులు నమోదు చెయ్యాలని ఫిర్యాదు చేస్తామంటున్నారు. మట్టి కట్ట తొలగింపు వివాదంతో రైతు మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది.
NGT On Kakinada Mada Forest: మడ అడవుల తొలగింపుపై.. ఎన్జీటీ ఆగ్రహం