సీఎం వైయస్ జగన్ (Jagan Mohan Reddy) కోనసీమ జిల్లా పర్యటనకు వెళుతున్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం వైఎస్ జగన్. ఆయన పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరతారు జగన్. 10.30 గంటలకు పి.గన్నవరం మండలం జి.పెదపూడి గ్రామానికి చేరుకుంటారు ముఖ్యమంత్రి. 11 గంటలకు పుచ్చకాయల వారిపేటలో వరద బాధితులతో సమావేశం నిర్వహిస్తారు. తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశం నిర్వహిస్తారు. గోదావరి వరద కారణంగా లంక గ్రామాల వాసులు ఇప్పటికే వరద నీటిలోనే వుండిపోయారు.
అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుంటారు సీఎం జగన్. అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుంటారు.అక్కడ వరద బాధితులతో సమావేశం అనంతరం సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వరద ప్రభావం అనంతరం తీసుకున్న సహాయక చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం జరుపుతారు.
అనంతరం రాత్రికి అక్కడే బస చేయనున్నారు సీఎం జగన్. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటనతో బాధితులకు కాసింత ఉపశమనం కలగనుంది. కోనసీమ జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి 51 లంక గ్రామాలు వరద నీటిలో మునిగి ఉన్నాయి. వరద ముంపుతో లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో బాధితులకు జగన్ ఏం ప్రకటిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Akshay Kumar : ఐదోసారి అత్యధిక పన్ను చెల్లించిన అక్షయ్ కుమార్!