Akshay Kumar paid the highest tax for the fifth time!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మన దేశంలో ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ నుండి అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తిగా నిలిచాడు. ఈ మేరకు అత్యధిక పన్ను చెల్లించే వ్యక్తి అని ధృవీకరిస్తూ ఆదాయపు పన్ను శాఖ గౌరవ ధృవీకరణ పత్రాన్ని అందచేసింది. గత ఐదేళ్లుగా దేశంలోనే అత్యధిక పన్ను చెల్లింపుదారుగా అక్షయ్ కొనసాగుతుండటం విశేషం. లండన్ లో షూటింగ్‌లో ఉండటం వల్ల అక్షయ్ తరపున అతడి బృందం ఆదాయపుపన్ను శాఖ నుండి గౌరవ ధృవీకరణ పత్రాన్ని అందుకుంది. ఈ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్షయ్ కుమార్ ఇప్పటికీ అధిక సంఖ్యలో ప్రకటనలలో నటిస్తూ సినిమాలలోనూ నటిస్తున్నారు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రంలో నటించిన అక్షయ్ ఇటీవల సమంతతో కలసి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో కనిపించాడు. ప్రస్తుతం ‘రక్షా బంధన్, రామసేతు, సెల్ఫీ’ సినిమాల్లో నటిస్తున్నాడు అక్షయ్.
తమిళనాడు నుంచి రజనీకాంత్
ఇక తమిళనాడు నుంచి రజనీకాంత్ అత్యధిక పన్ను చెల్లించిన తారగా నిలిచారు. ఆదివారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతుల మీదుగా ఆయన కుమార్తె ఐశ్వర్య అవార్డును అందుకున్నారు. ఈ మేరకు ఇన్ స్టాలో షేర్ చేస్తూ ‘అత్యదిక పన్నును చెల్లింపు దారుని కుమార్తె గా గర్విస్తున్నాను. ఆదాయపుపన్ను దినోత్సవ సందర్భంగా నాన్నను గౌరవించిన తమిళనాడు, పుదుచ్చేది ఆదాయపుపన్ను శాఖల వారికి నా ధన్యవాదాలు’ అని అన్నారు. రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమాలో నటిస్తున్నాడు.
తెలుగునాట ఎవరు!?
టాలీవుడ్ లో ఎవరు ఎక్కువ పన్ను చెల్లిస్తున్నారనే విషయం ఇప్పటి వరకూ బయటకు రాలేదు. నిజానికి ఈ విషయంలో మన వాళ్లు ఎక్కువ గోప్యతను పాటిస్తున్నారనే చెప్పాలి. ఇకనైనా పన్ను చెల్లింపు విషయంలో మనటాలీవుడ్ పెద్ద మనుషులు పారదర్శకతను పాటిస్తారని ఆశిద్దాం.
