రేపు సీఎం వైయస్ జగన్ విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు ఆర్ధిక సాయం అందించే కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం వైఎస్ జగన్. ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ బయలుదేరతారు సీఎం జగన్. 10.30 గంటలకు విశాఖ చేరుకుంటారు సీఎం జగన్. 11.05 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకుని వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం వుంటుంది.
అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ముఖ్యమంత్రి జగన్. మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి తాడేపల్లికి బయలు దేరతారు సీఎం జగన్. మరోవైపు రేపు మధ్యాహ్నం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏరియల్ సర్వే జరుపుతారు. ఏరియల్ సర్వే కోసం ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గోదావరి వరదలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలన్నారు సీఎం.
ఇరిగేషన్ రివ్యూ సందర్భంగా సీఎం ఆదేశాలు జారీచేశారు. ఉదయం గోదావరికి వస్తున్న వరదలపై ఇరిగేషన్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు సీఎం జగన్. రానున్న 24 నుంచి 48 గంటల వరకూ వరదనీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో తెలిపారు అధికారులు. తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌సహా బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతున్నట్టుగా వివరించారు అధికారులు. దాదాపు 23 –24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని తెలిపారు అధికారులు.
ఆమేరకు పోలవరం వద్దా, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తంచేయాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు సీఎం. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు సీఎం జగన్.