అసలే సినిమాల వైపు జనం పరుగులు తీయడం మానేశారని విశేషంగా వినిపిస్తోంది. అందుకు ఓటీటీ ఎఫెక్ట్ కారణమనీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన భారతీయ సినిమాలకు హాలీవుడ్ కామిక్ మూవీస్ కూడా దెబ్బ కొడుతున్నాయని తెలుస్తోంది. అందుకు జూలై 7న విడుదలైన మార్వెల్ మూవీ ‘థోర్: లవ్ అండ్ థండర్’ తాజా ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ సినిమా మన దేశంలో మొదటివారానికి రూ. 78 కోట్లు పోగేసింది. నిజానికి ఇంతకు ముందు వచ్చిన కామిక్ బేస్డ్ మూవీస్ ‘స్పైడర్ మేన్: నో వే హోమ్’, ‘డాక్టర్ స్ట్రేంజర్ అండ్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్’ చిత్రాలతో పోలిస్తే ‘థోర్: లవ్ అండ్ థండర్’ సాధించింది తక్కువే. అయితే మన బాలీవుడ్ మూవీస్ కంటే మిన్నగా ‘థోర్’ నిలవడమే ఇక్కడి విశేషం!
‘థోర్’ మొదటి రోజున రూ.18.60 కోట్లు సాధించింది. ట్రేడ్ పండిట్స్ ఫస్ట్ వీక్ లోనే ఈ సినిమా వంద కోట్లు చూస్తుందని భావించారు. అయితే తరువాతి రోజుల్లో ‘థోర్’ మెల్లగా మెత్తబడింది. అందువల్లే రూ.78 కోట్లతో సరిపుచ్చుకోవలసి వచ్చింది. దీని దరిదాపుల్లో ఉన్నమన బాలీవుడ్ సినిమా ఏదంటే – వరుణ్ ధవన్, కియారా అద్వాణీ నటించిన ‘జగ్ జుగ్ జియో’ అనే చెప్పాలి. ఈ సినిమా మనదేశంలో ఫస్ట్ వీక్ రూ.60 కోట్లు సాధించింది. మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్’ ఇప్పటి దాకా రూ.31.15 కోట్లు పోగేసింది. శివలీక ఒబెరాయ్ నటించిన ‘ఖుదా హఫీజ్ ఛాప్టర్ 2- అగ్నిపరీక్ష’ చిత్రం మొదటి వారానికి రూ. 9.11 కోట్లు మాత్రమే చూసింది.
ఇలా మన సినిమాలు విదేశీ అనువాద చిత్రాల ముందు చితికి పోవడానికి కారణం, ఓటీటీ ఫ్లాట్ ఫామ్సే అని సినీజనం భావిస్తున్నారు. ఎంతటి భారీ చిత్రమైనా ఓ నెలలోపే ఓటీటీలో దర్శనమిస్తూ ఉన్న కారాణంగానూ, ఓటీటీల కోసమే ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్న వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ వల్ల జనం థియేటర్లకు రావడం తగ్గిపోయింది. తత్ఫలితంగానే బాక్సాఫీస్ వద్ద మన సినిమాలు బోరుమంటున్నాయి. మరి విదేశీ డబ్బింగ్ సినిమాలు ఎలా అలరిస్తున్నాయి? అంటే- వాటిలో ఉండే భారీతనమే యువతను ఆకర్షిస్తోందని పరిశీలకులు అంటున్నారు. మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ ను ఊపేసే చిత్రం మళ్ళీ ఎప్పుడు వస్తుందో!