ఒంగోలులో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్‌పై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సీఎం కాన్వాయ్ కోసమంటూ తిరుమల వెళ్తున్న ఓ కుటుంబాన్ని ఆపి వాహనాన్ని తీసుకెళ్లిన ఉదంతంపై చర్యలు చేపట్టారు. వాహనాలను ఆపిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి వినుకొండ నుంచి తిరుమల వెళ్తున్న ఓ కుటుంబం టిఫిన్ కోసం ఒంగోలులో ఆగింది. అక్కడికి వచ్చిన ఓ కానిస్టేబుల్ సీఎం జగన్ పర్యటనకు కాన్వాయ్ కావాలంటూ వాహనాన్ని, డ్రైవర్‌ను తీసుకెళ్లాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర ఇక్కట్లకు గురైంది.
ఈ నేపథ్యంలో సీఎం పర్యటన పేరుతో ఓవరాక్షన్ చేసిన ఒంగోలు ఏఎంవీవై సంధ్య, హోంగార్డు తిరుపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా తాము తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటే పోలీసులు ఒంగోలులో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని.. రాత్రి సమయంలో కావడంతో తమ ఫ్యామిలీ భద్రత కోసం ఆర్టీసీ డిపోలో తలదాచుకున్నామని బాధితుడు శ్రీనివాస్ వెల్లడించాడు. మరో వాహనం ఏర్పాటు చేసుకుని తాము తిరుమల చేరుకున్నట్లు వివరించాడు. పోలీసుల వ్యవహార శైలి కారనంగా తిరుపతిలో తాము తలపెట్టిన మెట్లపూజ కూడా రద్దు చేసుకున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా ఒంగోలులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల కోసం రెండు కిలోమీటర్ల మేర బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం పర్యటన సాగే రెండు కిలోమీటర్ల మేర చిరు దుకాణాలను అధికారులు తొలగించారు. దీంతో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల పాటు షాపులు మూసివేస్తే తమ జీవనం ఎలా సాగుతుందని చిరు వ్యాపారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
Supreme Court: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై కీలక ఆదేశాలు.. రేపటిలోగా వివరాలు సమర్పించాలి