CM Jagan: ఏపీ ఆర్ధిక వ్యవస్థపై అసెంబ్లీలో సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నా ఏపీ గణనీయంగా వృద్ధి సాధించిందని వెల్లడించారు. అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందని దుష్ప్రచారం కూడా చేస్తున్నారని.. రుణాలకు వడ్డీల కింద రూ. 21,499 కోట్లు, రుణంగా రూ. 14,558 కోట్లు చెల్లించామని సీఎం జగన్ వివరించారు. అలాగే రాష్ట్ర రెవెన్యూ 2021-22 ఆర్ధిక సంవత్సరానికి రూ. 75,696 కోట్లు వచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధి రేటు పరుగులు పెడుతోందని.. రాష్ట్ర రెవెన్యూ కూడా గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. తమ ఐదేళ్ల కాలపరిమితి ముగిసే సమయానికి గత ప్రభుత్వం కంటే మెరుగైన పనితీరు కనపరుస్తామన్నారు. మూలధన వ్యయం గురించి కూడా దుష్ప్రచారం చేస్తున్నారని.. సంక్షేమ పథకాలు, ప్రజాకర్షక పథకాల పైనే డబ్బులు వ్యయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని.. మూడేళ్లలో మూలధన వ్యయంగా భారీ మొత్తాన్నే ఖర్చు చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్య, వైద్యం, నాడు నేడు కార్యక్రమాలు, వ్యవసాయ రంగాలకు ఈ వ్యయం జరిగిందన్నారు.
మూల ధన వ్యయం కింద 2014- 19 వరకు రూ. 76,139 కోట్లు వ్యయం చేస్తే గడచిన మూడేళ్లలోనే తమ ప్రభుత్వం రూ.55,086 కోట్లు ఖర్చు చేశామని అసెంబ్లీలో సీఎం జగన్ వెల్లడించారు. 15వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం పన్నుల ఆదాయాన్ని పంచడం లేదన్నారు. ఏపీ దురదృష్టం ఏమిటంటే ప్రస్తుతం 32 శాతం మాత్రమే పన్నుల ఆదాయాన్ని కేంద్రం ఇచ్చిందన్నారు. తమ పాలనలో తెచ్చిన సంస్కరణలు, డీబీటీ లాంటి విధానాలు, సుపరిపాలన, ఆర్ధిక క్రమశిక్షణ వల్ల పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని సీఎం జగన్ వివరించారు. ఇంత చేస్తున్నా ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని జగన్ కోరారు. గతంలో ఎంత బడ్జెట్ ఉందో ఇప్పుడు కూడా అంతే బడ్జెట్ ఉందన్నారు. అప్పుడు, ఇప్పుడు బడ్జెట్ ఒకేలా ఉన్నా చంద్రబాబు హయాంలో అమ్మ ఒడి పథకం, రైతు భరోసా, చేయూత లాంటి పథకాలు ఎందుకు లేవని సీఎం జగన్ ప్రశ్నించారు.
Read Also: Gautam Adani Becomes World’s Second Richest person: ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో అదానీ..
2014 నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.14వేల కోట్లు మాత్రమేనని.. 2019లో చంద్రబాబు దిగిపోయేనాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.59వేల కోట్లకు ఎగబాకాయని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు హయాంలో అప్పులు ఏకంగా 123.52 శాతం పెరిగాయన్నారు. చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు రూ.2.69 లక్షల కోట్లుగా ఉంటే ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.3.82 లక్షల కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు. మూడేళ్లలో రాష్ట్ర రుణం 41.83 శాతం పెరిగిందని సీఎం జగన్ వెల్లడించారు.