CM Jagan: చిత్తూరు జిల్లా కుప్పం వేదికగా సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. కుప్పంలో చంద్రబాబుపై ప్రజలు విసిగిపోయారని.. అందుకే 2019 తర్వాత కుప్పంలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు వైసీపీ జెండాను ఎగురవేశారని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గం బీసీలు పోటీ చేయాల్సిన సీటు అని.. కానీ చంద్రబాబు బీసీల సీటును లాక్కుని పోటీ చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి బీసీలను న్యాయం చేస్తాడని ఎలా అనుకుంటారని ప్రశ్నించారు. గత 36 ఏళ్లలో కుప్పం సీటును ఒక్కసారి అయినా బీసీలకు ఇచ్చారా అని జగన్ నిలదీశారు. కుప్పంపై చంద్రబాబుకు వెన్నుపోటు ప్రేమ మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న భరత్ తనతో కుప్పానికి ఎన్నో అభివృద్ధి పనులు చేయిస్తున్నాడని.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ నేత భరత్‌ను గెలిపించాలని.. భరత్ గెలిస్తే మంత్రిగా కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాడని జగన్ తెలిపారు.
Read Also:CM Jagan : కమీషన్ల కోసం కక్కుర్తిపడి తనవాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చాడు
అటు కుప్పం బ్రాంచ్ కెనాల్ ఆరునెలల్లో పూర్తి చేసి తానే వచ్చి ప్రారంభిస్తానని సీఎం జగన్ వెల్లడించారు. కుప్పం ప్రజలకు గత మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా రూ.1,149 కోట్లు ఇచ్చామని ఆయన వివరించారు. కుప్పం నియోజకవర్గంలో డీబీటీ ద్వారా రూ.866 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.283 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. కుప్పంలో పలు అభివృద్ధి పనులకు రూ.66 కోట్లు ఇచ్చింది మీ బిడ్డ జగనే అని తెలిపారు. కలగా మిగిలిన ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది, రామకుప్పంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసింది కూడా తానేనని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి చేసింది, ఒకేషనల్ జూనియర్ కాలేజీ పూర్తి చేసింది కూడా తమ ప్రభుత్వమే అని సీఎం జగన్ స్పష్టం చేశారు.