వైఎస్ జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం రైతులకు భరోసా కల్గిస్తోంది. ఇప్పటికే వరసగా నాలుగో ఏడాది, ఈ ఏడాదికి మూడో విడతగా రైతన్నలకు ఒక్కొక్కరికి ఏటా రూ. 13,500 చొప్పున వరుసగా 3 ఏళ్ళు రైతు భరోసా – పీఎం కిసాన్ సాయం అందించడంతో పాటు నాలుగో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి రూ. 11,500 చొప్పున సాయం అందించింది జగన్ ప్రభుత్వం. నేడు మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ. 2,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ. 1090.76 కోట్ల రైతు భరోసా సాయాన్ని మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.
దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా క్రింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ. 13,500 రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే. ఇప్పుడు అందిస్తున్న సాయం రూ. 1,090.76 కోట్లతో కలిపి ఈ మూడున్నరేళ్ళలో వైఎస్ జగన్ ప్రభుత్వం రైతన్నలకు అందించిన మొత్తంలో కేవలం వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ సాయం మాత్రమే రూ. 27,062.09 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది.
వైఎస్ జగన్ ప్రభుత్వం ఇస్తున్నది ఏటా రూ. 13,500 – 5 సంవత్సరాలకు కలిపితే ఆ మొత్తం రూ. 67,500గా ఉంది. రైతన్నకు అదనంగా అందిస్తున్న మొత్తం రూ. 17,500. రైతు భరోసా క్రింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి అందిస్తున్న రైతు భరోసా సాయం రూ. 13,500. మొదటి విడత – ఖరీఫ్ పంట వేసే ముందు – మే నెలలో రూ. 7,500, రెండవ విడత – అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంట కోత సమయం మరియు రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడత – పంట ఇంటికి వచ్చే సమయాన, జనవరి–ఫిబ్రవరి నెలలో రూ. 2,000 అందిస్తోంది. మూడేళ్ళ తొమ్మిది నెలల్లో రైతన్నలకు జగనన్న ప్రభుత్వం అందించిన సాయం రూ. 1,45,751 కోట్లు.
గత ప్రభుత్వంలో అరకొరగా విత్తనాలు, ఎరువుల పంపిణీ, బీమా క్లెయిమ్‌లు ఎప్పుడు వస్తాయో, ఎంతమందికి వస్తాయో, ఎంత వస్తాయో తెలియని పరిస్ధితి. ఆశాస్త్రీయంగా పంట నష్టాల అంచనా, అయిన వారికే పరిహారం, ఏడాది పొడవునా కరవు, ఐదేళ్ళలో 1,623 కరవు మండలాల ప్రకటన, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచన లేదు. 2022 డిసెంబర్‌లో మాండోస్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టంతో పాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా నష్టపోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు రూ. 76.99 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని రబీ 2022 ముగియక ముందే నేడు (28.02.2023) బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలకు జమ చేయనున్నారు జగన్. నేడు జమ చేస్తున్న రూ. 76.99 కోట్లతో కలిపి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 22.22 లక్షల మంది రైతన్నలకు అందించిన మొత్తం ఇన్‌పుట్ సబ్సిడీ అక్షరాల రూ. 1,911.78 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది.
గతానికి భిన్నంగా శాస్త్రీయంగా, అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ–క్రాప్ ఆధారంగా పంట నష్టాల అంచనా. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితాలు ప్రదర్శించి మరీ, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం.
* 2020 మార్చివరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన 1.57 లక్షల మంది రైతులకు రూ. 123.70 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ 2020 ఏప్రిల్ లో అందజేత
* 2020 ఏప్రిల్ నుండి 2020 అక్టోబర్ వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన 3.71 లక్షల మంది రైతులకు రూ. 278.87 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ 2020 అక్టోబర్, నవంబర్‌లో అందజేత
* 2020 నవంబర్ చివరిలో నివార్ సైక్లోన్ వల్ల నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ. 645.99 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ 2020 డిసెంబర్‌లో అందజేత
* 2021 సెప్టెంబర్ నెల చివరిలో గులాబ్ సైక్లోన్ వల్ల నష్టపోయిన 35 వేల మంది రైతులకు రూ. 22.10 కోట్ల సాయం 2021 నవంబర్‌లో అందజేత
* 2021 నవంబర్‌లో భారీ వర్షాల వల్ల నష్టపోయిన 5.97 లక్షల మంది రైతులకు రూ. 542.10 కోట్ల సాయం 2022 ఫిబ్రవరిలో అందజేత
* 2019 గత ప్రభుత్వంలో తిత్లీ తుఫాన్ వల్ల నష్టపోయిన ఉద్యానవన పంటలకు అదనపు పరిహారం 91 వేల మంది రైతన్నలకు 182.63 కోట్లు 2022 జూన్‌లో అందజేత
* జులై – అక్టోబర్ 2022లో భారీ వర్షాల వల్ల నష్టపోయిన 46 వేల మంది రైతన్నలకు రూ. 39.40 కోట్లు నవంబర్ 2022లో అందజేత
* డిసెంబర్ 2022 మాండోస్ తుఫాన్ వల్ల నష్టపోయిన 91 వేల మంది రైతన్నలకు రూ. 76.99 కోట్లు నేడు (28.02.2023) అందజేత
ఈ–క్రాప్ డేటా ఆధారంగా పంట నష్టాలకు ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నందున కౌలు రైతులతో పాటు వాస్తవ సాగుదారులందరికీ లబ్ధి చేకూరుతోంది. లబ్ధిదారుల జాబితాలు సోషల్ ఆడిట్ కొరకు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నందున గ్రామ స్ధాయిలోనే రైతులు తమ వివరాలు చూసుకుని, పేర్లు లేకపోతే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.