CM Chandrababu: మామిడి రైతులు పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పంలోని తన నివాసంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం నిర్వహించారు సీఎం. రైతుల నుంచి తక్షణం మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు. అదే సమయంలో పల్ప్ పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు వారి మాయలో పడొద్దన్నారు చంద్రబాబు. మామిడి రైతులకు భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యా లేకుండా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు.
Read Also: Reels Addiction: రిల్స్ ఎక్కువగా చూస్తున్నారా..? నిపుణులు ఏమంటున్నారంటే..
ఇక, ఇప్పటి వరకు 1.12 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలు జరిగిందని.. ఇంకా 1.70 లక్షల మెట్రిక్ టన్నుల వరకూ ఉత్పత్తి రావాల్సి ఉందని ఈ సమావేశంలో అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. మరోవైపు ఆర్డర్లు లేవని, నిల్వ చేసుకోడానికి స్థలం లేదని పల్ప్ పరిశ్రమలు మామిడిని కొనుగోలు చేయటం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కొన్ని చోట్ల అన్ లోడింగ్ కోసమే 3-4 రోజుల సమయం పడుతోందని ముఖ్యమంత్రికి విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం తక్షణం ఉత్పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రల ప్రతినిధులకు సూచించారు. మరోవైపు పాకిస్తాన్ , ఆఫ్రికన్ దేశాల్లో దిగుమతి సుంకాలు లేవని, యూరోపియన్ దేశాల్లో దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయని మ్యాంగో పల్ప్ పరిశ్రమలు, ఎగుమతిదారులు సీఎంకు తెలియచేశారు. సుంకాలు తగ్గించేలా ఆయా దేశాలను ఒప్పించేందుకు కేంద్రంతో మాట్లాడాలని కోరారు. అలాగే మ్యాంగో పల్ప్ పై విధిస్తున్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేలా మాట్లాడాలని సీఎంకు విన్నవించారు.
Read Also: Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు.. కాటన్ బాక్సుల్లో కార్మికుల శరీర భాగాలు
దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు, జీఎస్టీ తగ్గింపు పై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశామని.. మరోమారు దీనిపై మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇక మధ్యాహ్న భోజనం పథకంలో భాగంగా విద్యార్ధులకు మూడు రోజుల పాటు మ్యాంగో జ్యూస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే, విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంలో పోషకాహారంగా గుడ్డును అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసి తదుపరి ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు. మామిడి పంటలో ఎరువులు, పురుగుమందులు వాడకుండా అత్యుత్తమ విధానాలను అనుసరించాలని సీఎం చంద్రబాబు రైతులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంతా నేచురల్ ఫార్మింగ్ దిశగా అడుగులేస్తోందని.. మ్యాంగో రైతులు క్రమశిక్షణతో ఎరువులు , పురుగుమందుల వాడకం తగ్గించాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెస్టింగ్ , ట్రేసింగ్, సర్టిఫికేషన్ వచ్చిందని .. మన ఉత్పత్తులు అమ్ముడు పోవాలంటే ప్రపంచ ప్రమాణాలు ఉండాలన్నారు. ఎలాంటి వెయిటింగ్ లేకుండా మామిడి రైతులకు రూ.8 ధర చెల్లించి కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..