Sigachi Factory Blast: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు సమీపంలోని ఫార్మా కారిడార్ లోని పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ప్రమాదంలో సుమారు 45 మందికి పైగా కార్మికులు మృతి చెందారు. అయితే, పేలుడు ధాటికి ఘటన స్థలంలో పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల శరీర భాగాలు పూర్తిగా చిద్రం అయిపోయాయి. చెల్లాచెదురుగా పడిపోయిన సిగాచి ఫ్యాక్టరీ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల శరీర భాగాలను సేకరించి.. సుమారు 20 కాటన్ బాక్సులలో అధికారులు తీసుకు వచ్చారు. ఈ కాటన్ బాక్సులను మార్చురీలో ఆస్పత్రి సిబ్బంది భద్రపరిచారు. DNA పరీక్షలు నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.
Read Also: Disha Salian Case: దిశా సాలియన్‌ది ఆత్మహత్య.. హత్యకు ఆధారాలు లేవు..
మరోవైపు, సిగాచి పరిశ్రమలో పేలుడుపై నిపుణుల కమిటీ బృందం మూడు గంటలుగా ఘటన స్థలాన్ని పరిశీలిస్తుంది. ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది అనే దానిపై ఆరా తీస్తుంది. పేలుడు జరిగిన ప్రాంతాన్ని నిపుణులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. డ్రయర్ పేలిన తర్వాత రియాక్టర్ కూడా పేలిందా.. సేఫ్టీ వాల్వ్ పని చేయలేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమతితో మైక్రో సెల్యులోజ్ తయారు చేస్తున్నారా…? లేదా అనుమతి ఒకటి, తయారు చేసింది మరొకటా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటు చేసిన 30 ఏళ్ళలో ఇప్పటికి ఎన్నిసార్లు మిషనరీ మార్చారో తెలుసుకుంటున్నారు. చివరిగా పరిశ్రమలో సెఫ్టీ తనిఖీలు ఎప్పుడు చేశారు?.. అధికారుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే కోణంలోనూ నిపుణలు కమిటీ విచారణ చేస్తుంది.