దేశంలో మిర్చి ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల వాటా 60 శాతమని, ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 40 శాతమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవీఎల్ నరసింహారావు అన్నారు. “తామర తెగులు” కారణంగా ఏపీ తెలంగాణలో మిర్చి పంట దారుణంగా దెబ్బతిందని, ఆంధ్రప్రదేశ్ లో మిర్చి పంట సాగు 2 లక్షల హెక్టార్లకు పైగా ఉందన్నారు. తెలంగాణలో లక్ష ఎకరాలకు పైగా పంట సాగు జరిగిందని, 25 మంది శాస్త్రవేత్తలు, పంట నిపుణులతో నిన్న సమావేశం నిర్వహించానన్నారు. ఈరోజు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులను కలిసి పరిస్థితిని వివరించానని, నష్ట నివారణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి మాట్లాడానన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ. 4 వేల కోట్ల పంట నష్టం వాటిల్లిందని, ఈ తెగులు నివారణ కోసం పురుగు మందులపై రైతులు మరింత ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. పురుగు మందులు ఎక్కువగా వాడటం వల్ల కూడా మరో రకంగా నష్టం జరిగిందని, ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలన్నారు.