Chandrababu Kuppam Tour: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.. షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు చంద్రబాబు.. అయితే, రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో.. ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రాజ్, మున్సిపల్ రోడ్లపై సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకోనున్నారు.. అయితే, రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొంది సర్కార్.. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసింది.. ఇక, షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది.. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హోంశాఖ. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ఎలా ముందుకు సాగనుంది అనే చర్చ సాగుతోంది.
Read Also: ATM Technical Problem: ఏటీఎంలో సాంకేతిక లోపం.. కురిసిన నోట్ల వర్షం
మరోవైపు, చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు ఎటువంటి అనుమతులు లేవని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు పోలీసులు.. చంద్రబాబు రోడ్ షో, సభల్లో పాల్గొంటే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు పర్యటనలో ఎవరూ పాల్గొనకుడదని పోలీసులు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.. అయితే, ర్యాలీలు, సభలపై బ్యాన్ విధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను పట్టించుకోమని.. యథావిథిగా ర్యాలీలు, సభలు నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించారు టీడీపీ నేతలు.. కేవలం విపక్షాలను ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. తన కుప్పం పర్యటనలో ఎలా ముందుకు సాగనున్నారు అనేది ఉత్కంఠగా మారింది. అయితే, చంద్రబాబు కుప్పం పర్యటనలో కొన్ని మార్పులు చేశారు.. నియోజకవర్గంలోని శాంతిపురం, గుడిపల్లి మండలాల్లో బహిరంగ సభలు బదులుగా గ్రామ సభలు నిర్వహించనున్హనారు.. 5న కుప్పం టీడీపీ కార్యాలయంలో బూత్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహిస్తారు.. ప్రభుత్వ తాజా జీవో ఉదహరిస్తూ చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శికి పోలీసులు నోటీసు మంజూరు చేసిన నేపథ్యంలో మార్పులు చేశారు.