ఏపీలో జగన్ పాలనా తీరుపై తనదైన రీతిలో విమర్శలు చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ప్రభుత్వంతో పోరాడి గెలిచిన సర్పంచ్‌లే నిజమైన హీరోలు అన్నారు. జగన్ లాంటి సీఎంను నా జీవితంలో ఇప్పటి వరకూ చూడలేదు.గ్రామ పంచాయతీల పరిధిలో ఉండే మైనింగ్, ఇసుక క్వారీలపై పంచాయతీలదే అధికారం అన్నారు.
నరేగా నిధులు కూడా పంచాయతీలకు రావాల్సిందే. పంచాయతీలకు రావాల్సిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటే దొపిడీ అనాలా..? ఇంకేమైనా అనాలా..? రాష్ట్రానికి రావాల్సిన డబ్బులను కేంద్రం తీసేసకుంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా..? ట్రస్టీగా ఉండి రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయమంటే జగన్ చేస్తున్నారా..? చెత్తపన్ను వసూలు చేసేదే లేదని పంచాయతీల్లో తీర్మానం చేయాలని సూచించారు.
నా గవర్నమెంటు నా ఇష్టం అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారు.. నా పంచాయతీ నా ఇష్టం అని సర్పంచులూ చెప్పాలి. సీఎం జగనుకు రాజ్యాంగం ఎలాంటి హక్కులిచ్చిందో.. సర్పంచులకూ రాజ్యాంగం అలాంటి హక్కులే ఇచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం.. పార్టీ సర్పంచ్‌లు గెలిచిన చోట టీడీపీ ప్రభుత్వం వుంటుందన్నారు చంద్రబాబు.
అంతకుముందు టీడీపీ కార్యాలయంలో సర్పంచ్‌ల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల సర్పంచ్‌లు హాజరయ్యారు. ఇప్పటికే రెండు విడతలుగా సర్పంచ్‌ల అవగాహన సదస్సు నిర్వహించింది టీడీపీ. క్షేత్ర స్థాయిలో సమస్యలపై పోరాడాలని చంద్రబాబు సూచించారు. చెత్త పన్ను వసూలు చేయబోమంటూ గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేయాలని తెలుగుదేశం సర్పంచ్‌లకు ఇప్పటికే సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు. స్థానిక సంస్థల విషయంలో ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ఢిల్లీ స్థాయిలో పోరాటానికి ప్రణాళికలు సిద్దం చేస్తోంది టీడీపీ.