ఆంధ్రప్రదేశ్‌లో సైకిల్ గాలి వీస్తోంది… ఈ గాలిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకు పోతుందని జోస్యం చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబ నాయుడు.. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. కోడుమూరులో మాజీ సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయాల్లో విజయ భాస్కర్ రెడ్డి నీతి నిజాయితీ ఉన్నవ్యక్తి.. కానీ, అవినీతికి, అక్రమాలకు ప్రతిరూపం సీఎం జగన్ అంటూ ఫైర్ అయ్యారు. కోడుమూరు నియోజకవర్గంలో మట్టి దోపిడీ, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తున్నారు.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులు, ఎయిర్ పోర్ట్ సహా అన్ని నంద్యాల జిల్లాకు వెళ్లాయని ఆరోపించారు.. కర్నూల్ జిల్లాలో నీటి ఎద్దడి ఉంది.. ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టింది టీడీపీయే అన్నారు.. మూడేళ్లలో ఒక్క పని చేశారా? అని ప్రశ్నించిన చంద్రబాబు.. రోడ్ల మీద గుంతలు పడితే మట్టి వేయలేని సీఎం జగన్.. మూడు రాజధానులు కడతాడా? అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Risk of Hearing Loss: హెడ్‌ఫోన్స్ ఎఫెక్ట్.. 100 కోట్ల మందికి ముప్పు..!
ఇక, అన్ని పన్నులు పెంచారు.. చివరికి చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబు.. పత్తి రైతులకు నాసిరకం విత్తనాలు ఇచ్చి నష్టం చేశారన్న ఆయ.. సీఎం జగన్ ఒక్క రైతుతో మాట్లాడారా? దేశంలో ఎక్కువ రైతు ఆత్మహత్యలు ఉండేది మన రాష్ట్రంలోనే అని విమర్శించారు. రైతు ఆత్మహత్యలకు కారణం సీఎం జగనేనని వ్యాఖ్యానించిన ఆయన.. రాష్ట్రంలో సీఐడీ ఒక పనికి మాలిన శాఖగా మారిందన ఆరోపించారు. తప్పు చేసిన అధికారులను వదలం అని హెచ్చరించారు.. ఏదేమైనా రాష్ట్రంలో సైకిల్ గాలి వీస్తోంది… ఈ గాలిలో వైసీపీ కొట్టుకు పోవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.