ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు అంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాకు ప్రభుత్వం భద్రత కల్పించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాసారు. వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరుపాలని చంద్రబాబు కోరారు.
దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని, ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. బెదిరింపుల పరంపరలో వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన అన్నారు. ఇలాంటి చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని, హింసాత్మక ఘటనలపై చర్యలు లేకే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన తెలిపారు.