ఏపీ సర్కార్‌పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. 3 ఏళ్లుగా కాన్వాయ్ డబ్బులు ప్రభుత్వం బాకీ పడడం రాష్ట్రానికి అవమానమన్న ఆయన.. కాన్వాయ్ కోసం కార్లు పెట్టిన వారికి ప్రభుత్వం రూ. 17 కోట్ల బాకీ పడడం సిగ్గుచేటన్నారు.. వ్యవస్థల పతనానికి ఇది నిదర్శనం.. ఆందోళనకరం అన్నారు. పాలకుల వైఫల్యం అధికారులను, ఉద్యోగులను కూడా ఒత్తిడిలోకి నెట్టేస్తుందన్న చంద్రబాబు.. రాష్ట్రంలో వ్యవస్థల పతనం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. సీఎం కాన్వాయికు కార్లు పెట్టిన వారికి బిల్లులు చెల్లింపులు చేయకపోవడం రాష్ట్ర దుస్థితికి ఉదాహరణగా పేర్కొన్న ఆయన… కనీసం సీఎం కాన్వాయ్‌కు కార్లు కూడా పెట్టుకోలేని స్థితిలో రాష్ట్రం ఉండడం అవమానకరం అని ఎద్దేవా చేశారు.
Read Also: High Court: వైఎస్ వివేకా హత్య కేసు.. నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు..!
ఈ మొత్తం అంశాన్ని ఒక శాఖలో పెండింగ్ బిల్లుల అంశంగా మాత్రమే చూడకూడదు అన్నారు చంద్రబాబు… ఇది రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు, వ్యవస్థల ధ్వంసానికి దర్పణంగా పేర్కొన్న ఆయన.. ఇలాంటి ఘటనలు రాష్ట్ర బ్రాండ్‌ను దారుణంగా దెబ్బ తీస్తాయన్నారు. మూడేళ్లుగా బిల్లులు చెల్లింపులు జరపకపోతే అధికారులు ఎలా కార్లు ఏర్పాట్లు చేస్తారు..? అని నిలదీశారు. బిల్లులు రాక యజమానులు పడే బాధలకు ఎవరు బాధ్యత వహిస్తారు..? అని మండిపడ్డారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు ఎంత.. పెండింగులో ఉన్న బిల్లులు ఎంత అనే అంశం పై వైట్ పేపర్ వేసి వాస్తవాలు వెల్లడించగలరా..? అంటూ జగన్ సర్కార్‌కు సవాల్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు.