విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాచార బాధిత కుటుంబాన్ని శుక్రవారం మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయటం ఏపీకే అవమానం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని.. ఈ సంఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ తాను మాత్రం సిగ్గుపడుతున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇంత జరిగినా సీఎం జగన్ నేరుగా ఆసుపత్రికి రాకుండా మోసపూరిత సున్నా వడ్డీ పథకం కోసం ప్రకాశం జిల్లా వెళ్లారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్ బాధ్యత లేకుండా వ్యవహరించటం వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. గ్యాంగ్ రేప్ సంఘటన ప్రభుత్వానికి అవమానంగా అనిపించట్లేదా అని చంద్రబాబు నిలదీశారు. రాష్ట్రంలో ఇంకెన్ని మానభంగాలు జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందో అర్ధం కావడం లేదన్నారు. కాగా విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద టీడీపీ, వైసీపీ మహిళా నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బాధితురాలిని పరామర్శించేందుకు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వెళ్లగా.. టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ ఆమెపై ఫైరయ్యారు. బాధితురాలితో ఫోటోలు దిగేందుకు వచ్చారా అంటూ వాసిరెడ్డి పద్మపై టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vijayawada: ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ కేసు.. ఇద్దరు పోలీసులపై వేటు