కాకినాడ పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. మరోసారి ఎన్నికల పొత్తులపై చర్చకు దారితీశాయి.. దీనిపై విమర్శలు కూడా గట్టిగానే వచ్చాయి.. అయితే, కాకినాడలో తన కామెంట్లను వక్రీకరించారని తెలిపారు చంద్రబాబు. టీడీపీ ముఖ్య నేతలు, క్షేత్ర స్థాయి నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. వైసీపీవి డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు.. తన బలహీనతలను అధిగమించడానికి వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తోందని మండిపడ్డారు. భీమిలి పర్యటనలో ప్రజలు జై బాబు అన్న స్లోగన్స్ ను జై జగన్ అన్నట్లుగా మార్ఫింగ్ చేసి ప్రచారం చేశారని దుయ్యబట్టారు.
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలంటూ తాను కాకినాడలో చేసిన వ్యాఖ్యలను.. పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.. వైసీపీ మొదటి నుంచి డైవర్షన్ పాలిటిక్సే తన విధానంగా పెట్టుకుందన్న ఆయన.. తన పర్యటనలకు అనూహ్య స్పందన రావడంతో వైసీపీ డైవర్షన్ డ్రామా మొదలు పెట్టిందని ఎద్దేవా చేశారు. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు.. ఇక, 2024లో ఓడిపోతే వైసీపీ అనేది ఉండదని జగన్‌కు అర్థం అయ్యిందని వ్యాఖ్యానించారు. జగన్ సింహం కాదు పిల్లి అంటూ ఎద్దేవా చేసిన చంద్రబాబు.. భయంతో అందరి కాళ్లు పట్టుకున్న నేత జగన్.. ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్ వైసీపీ బలహీనతకు నిదర్శనంగా తెలిపారు.. మరోవైపు, గ్రామస్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించాలని సూచించిన చంద్రబాబు.. 2024 ఎన్నికలే వైసీపీకి చివరి ఎన్నికలు అంటూ జోస్యం చెప్పారు.