ఏపీ సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరును తొలగించి తన పేరు పెట్టుకోవడం జగన్ అహంకారమే అని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ పేరుతో పథకాన్ని అమలు చేశామని.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 15 దేశాల్లో పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత చదువులు చదివేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించామని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ విదేశీ విద్యాదరణ పథకం కింద బీసీ, మైనారిటీ విద్యార్థులకైతే రూ.15 లక్షలు… ఈబీసీ, కాపు విద్యార్థులైతే రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు.
Read Also: Godavari Floods: మునిగిన కూనవరం బ్రిడ్జి.. ఆరు జిల్లాల పరిధిలో 1,79,668 మంది వరద బాధితులు
ఐదేళ్ల టీడీపీ హయాంలో మొత్తం 4,528 మంది విద్యార్థుల విదేశీ విద్యకు రూ.377.7 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించినట్లు చంద్రబాబు వివరించారు. మూడేళ్లపాటు ఈ పథకాలను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం’ పేరు నుంచి అంబేద్కర్ పేరును తొలగించిందని.. జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయనను అవమానించడమేనని విమర్శలు చేశారు. ఇది ముమ్మాటికీ జగన్ అహంకారమే అన్నారు. అంతేకాదు అంబేద్కర్‌ను దైవంగా భావించే వారందరినీకూడా అవమానించినట్లేనని అభిప్రాయపడ్డారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయనను అవమానించడమే. ఇది జగన్ అహంకారమే. అంతేకాదు అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించినట్టే.(4/5)
— N Chandrababu Naidu (@ncbn) July 16, 2022