Central Government: ఆర్థిక లోటుతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు గుడ్ న్యూస్ అందించింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.879 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికే పలు విడతల కింద ఏపీకి కేంద్రం రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది. తాజాగా దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.879 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్లు ఆర్ధిక శాఖ వెల్లడించింది. ఈ నిధులతో ఈ ఏడాది ఏపీకి రెవెన్యూ లోటు కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల సంఖ్య రూ.7,032 కోట్లకు చేరింది.
Read Also: శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు
దేశవ్యాప్తంగా రెవెన్యూ లోటుతో మొత్తం 14 రాష్ట్రాలు సతమతం అవుతున్నాయి. వాటిలో ఏపీతో పాటు అసోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీ కోసం మంగళవారం కేంద్రం రూ.7,183 కోట్లను విడుదల చేసింది. వీటిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ కు రూ.1,132 కోట్లు విడుదలయ్యాయి. కాగా ఇటీవల ఏపీ ప్రభుత్వంలో రెవెన్యూ లోటు భారీగా పెరిగిపోయింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రూ.17,036.15 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని అధికారులు అంచనాలను రూపొందించారు. కానీ సెప్టెంబరుతో ముగిసిన అర్ధ సంవత్సరం చివరి నాటికి రెవెన్యూ లోటు ఏకంగా రూ.40,963.64 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది. అధికారుల అంచనాలతో పోలిస్తే 240 శాతం మేర రెవెన్యూ లోటు ఉన్నట్లు స్పష్టమవుతోంది.