ఆంధ్రప్రదేశ్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగుచూసిన అవకతవకలు ప్రభుత్వ ఆదాయినిక భారీగా గండి కొట్టాయి.. దీంతో.. అప్రమత్తం అయిన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.. అవకతవకలకు చెక్‌పెట్టే విధంగా అడుగులు వేస్తోంది.. దీనిపై మీడియాతో మాట్లాడిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను హెచ్‌వోడీ కార్యాలయాలకు అనుసంధానం చేసే ప్రక్రియ జరుగుతోందన్న ఆయన.. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న డాక్యుమెంట్ల డిజిటలైజేషన్ ప్రక్రియ చేపడుతున్నాం అన్నారు. 15 కోట్ల పేజీల డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది.. 1850 సంవత్సరం నుంచి ఉన్న డాక్యుమెంట్లు డిజిటలైజేషన్ చేసేందుకు ఓ ప్రైవేటు సంస్థను సంప్రదించామని తెలిపారు.
Read Also: AP: అతి పెద్ద హవాలా రాకెట్ గుట్టు రట్టు..!
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తరచూ వచ్చే బ్యాంకర్లు, రియల్టర్లు, టిడ్కో విభాగం, సాధారణ ప్రజలకు వేగంగా సేవలు అందించే లక్ష్యంతో పబ్లిక్ డేటా ఎంట్రీ సిస్టమ్‌ను స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అమలు చేస్తోందని తెలిపారు రజత్ భార్గవ.. రాష్ట్ర వ్యాప్తంగా 37 గ్రామవార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నాం.. ఆయా సచివాలయాల్లోని పంచాయితీ కార్యదర్శులకు సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించాం. 2021-22 ఆర్ధిక సంవత్సరం లో నెలకు 1000 కోట్ల చొప్పున రియల్ ఎస్టేట్ లావాదేవీలు జరిగాయన్నారు.. రిజిస్ట్రేషన్, స్టాంపులు విభాగం ద్వారా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ. 7327 కోట్ల ఆదాయం వచ్చిందని.. 20.76 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ జరిగిందని వెల్లడించారు.