తిరుమలలో సంచలనం కలిగించిన బాలుడి కిడ్నాప్ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. కిడ్నాప్ కి గురైన బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీసీటీవీ పుటేజి ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నిన్న ఉదయం రైల్వే స్టేషన్ కి బాలుడితో సహ కిడ్నాపర్ చేరుకున్నట్టు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ విజువల్స్ కనిపిస్తున్నాయి.
కిడ్నాపర్ తెలుగు భాష మాట్లాడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. తిరుపతి నుంచి ట్రైన్ ద్వారా నెల్లూరు లేదా కడపకు వెళ్ళినట్లు భావిస్తున్నారు పోలీసులు. బాలుడి ఆచూకీ కోసం నెల్లూరు,కడపకు ప్రత్యేక పోలిస్ బృందాలు బయలుదేరాయి. ఆదివారం సాయంత్రం 5:45 గంటలకు బాలుడు తప్పిపోగా రాత్రి 7:11 గంటలకు బాలుడిని తీసుకుని మహిళ తిరుమల నుంచి తిరుపతికి పారిపోయిందని తెలుస్తోంది. అనంతరం మహిళ తిరుపతిలో ఏపీ03 జెడ్ 0300 నంబరు గల ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరికైనా బాలుడి జాడ తెలిస్తే 9440796769, 9440796772 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Tirumala: తిరుమలలో కలకలం.. ఐదేళ్ల బాలుడి కిడ్నాప్