GVL Narasimha Rao: తెలుగు రాష్ట్రాలలో స్కాంలు జరుగుతున్నాయని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తున్నాయని.. ఈ స్కాం ద్వారా అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూరిందనే ప్రచారం జరుగుతోందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. గ్రేట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలన్నారు. అటు ఏపీలో లేపాక్షి భూముల వ్యవహారం పెద్ద ల్యాండ్ స్కామ్ అని జీవీఎల్ విమర్శలు చేశారు. రూ.10వేల కోట్లు విలువ చేసే భూములను కేవలం రూ.500 కోట్లకు కట్టబెట్టడం అనే అడ్డగోలు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరోవైపు విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని.. ఉద్దేశ పూర్వకంగా తొలగించి ఓట్లు 50వేలకు పైగానే ఉన్నాయని జీవీఎల్ ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. దీంతో స్థానిక అధికారులు తప్పులు దిద్దుకునే చర్యలు ప్రారంభించారని పేర్కొన్నారు.
Read Also: Lakshmi Parvathi: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. టీడీపీని స్వాధీనం చేసుకోవాలి
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల వ్యవహారంలో గత ఒప్పందాలు, పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆరోపణలు నిజమని నమ్మాల్సి ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్‌గా చేరిన తర్వాత భూములు బదలాయింపు జరగడం వెనుక కారణాలు బయటపెట్టాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ కార్యాచరణ ప్రకటిస్తామని జీవీఎల్ హెచ్చరించారు. అటు అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపైనా జీవీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షా, ఎన్టీఆర్ మధ్య భేటీ సినిమాల కోసం జరిగిందని తాను భావించడం లేదని.. రాజకీయ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఏమి చర్చించారో షా, ఎన్టీఆర్‌కు మాత్రమే తెలుసన్నారు. బీజేపీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ అని.. ఇందులో చేరాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారని.. అది నిరంతర ప్రక్రియ అన్నారు. షా, జూనియర్ భేటీపై రాజకీయ పార్టీలు ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదన్నారు.
అటు లేపాక్షి భూముల వ్యవహారంపై సీబీఐ విచారణకు అదేశించాలని.. గవర్నర్ స్పందించి చర్యలకు ఉపక్రమిస్తే జగన్ పునాదులు కదులుతాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు.