అమలాపురం అల్లర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. బీజేపీ యువ మోర్చా సంఘర్షణ యాత్ర అంబేద్కర్ కోనసీమ అమలాపురం చేరుకున్న సందర్భంగా సంఘర్షణ యాత్రలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్ల కేసులో అమాయకులపై పెట్టిన కేసులను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. 90 శాతం కేసులు అమాయకులపై పెట్టారని ఆరోపించిన ఆయన.. 10 శాతం మాత్రమే అసలైన దోషులు కేసుల్లో ఉన్నారని పేర్కొన్నారు.. అసలు అల్లర్లకు కారకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, డీజీపీకి తెలుసు అని సంచలన కామెంట్లు చేశారు. తప్పుడు కేసుల వల్ల యువకులు, విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. కోనసీమ సోదరుల మధ్య కుల వైషమ్యాలు రెచ్చగొట్టవద్దు అని విజ్ఞప్తి చేశారు.
Read Also: Telangana Rains: గోదావరిలో పెరిగిన వరద.. ప్రమాద హెచ్చరిక జారీ
ముఖ్యమంత్రి రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి.. అమాయకులపై పెట్టిన కేసులను వెనక్కు తీసుకోవాలని సూచించారు సత్యకుమార్.. అవినీతి కేసులు, హత్య, అత్యాచారం కేసుల ఆరోపణలు ఉన్నవారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. కేవలం భావోద్వేగంతో ర్యాలీకి వెళ్లినవారిని, వాట్సాప్ పోస్టింగులు పెట్టిన వారిని, కోనసీమ అల్లర్ల కేసులో ఇరికించారని.. వందలాది మందిని అరెస్ట్ చేసి 70 రోజులుగా జైళ్లలో పెట్టడం న్యాయం కాదని హితవు పలికారు.. కాగా, కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో అమలాపురంలో జరిగిన ఆందోళన, నిరసన కార్యక్రమాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే.. ఈకేసులో ఇప్పటికీ అరెస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి.